CPS PROTEST ACROSS STATEWIDE : సీపీఎస్ అమలు చేసిన సెప్టెంబర్ 1ని విద్రోహదినంగా పాటిస్తున్న ఉద్యోగులు.. రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పోలీసుల అనుమతి నిరాకరణతో చలో విజయవాడ, సీఎం నివాస ముట్టడిని వాయిదా వేసిన ఉద్యోగులు.. నిరసన కార్యక్రమాలు యధావిధిగా చేపట్టారు. విజయవాడలోని పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద ఉద్యోగ సంఘాలు భారీ ఎత్తున ఆందోళనకు దిగాయి. ఇచ్చిన హామీని అమలు చేయమంటే నిర్బంధాల పేరుతో ప్రభుత్వం.. ఉపాధ్యాయులు, ఉద్యోగులను వేధిస్తోందన్న నేతలు.. ఇది మంచి పద్ధతి కాదని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పోరాటాలకైనా తాము సిద్ధమన్న వారు.. సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.
నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ జేఏసీ ఆందోళన చేపట్టింది. ప్రధాన ద్వారం వద్ద వర్షంలోనూ ఐకాస నేతలు ధర్నా నిర్వహించారు. సీపీఎస్ రద్దుతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసనలో ఏపీజేఏసీ నేత హృదయరాజు, జిల్లా ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఓపీఎస్ అమలుతో పాటు ఉద్యోగులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరులో తహసీల్దార్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల ఐకాస నాయకులు నంద్యాలలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ధర్నా చేపట్టారు.