SOFTWARE JOBS: సాఫ్ట్ వేర్ కంపెనీలకు మానవ వనరుల అవసరాలు పెరిగాయి. దీంతో.. విద్యార్థుల నైపుణ్యాలకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్ నైపుణ్యాలున్న వారికి సాఫ్ట్‌వేర్ కంపెనీలు మంచి ప్యాకేజీలు అందిస్తున్నాయి. కోర్ ఇంజినీరింగ్ విద్యార్థులూ ఐటీ ఉద్యోగాలకు అవసరమైన కోర్సులను నేర్చుకుంటూ ముందడుగు వేస్తున్నారు.
SOFTWARE JOBS: విజయవాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో గతేడాది 273 మంది, ఈ ఏడాది 148 మంది కోర్ ఇంజినీరింగ్ విద్యార్థులకు అసెంచర్, టీసీఎస్ కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయి. వీరు ఏడాదికి 4.5 నుంచి 7.2 లక్షల రూపాయల మధ్య వేతన ప్యాకేజీలు పొందుతున్నారు. కొందరు రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపికైనవారూ ఉండటం గమనార్హం. మరో కళాశాలలో ఈ ఏడాది 9 మంది కోర్ ఇంజినీరింగ్ విద్యార్థులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు సాధించారు. విశాఖపట్నంలోని మరో కళాశాలలో 168 మంది విద్యార్థులు.. కెమికల్ ఇంజినీరింగ్ చదివిన మరో 14 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పొందారు. వీరందరూ క్యాప్ జెమిని, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం విశేషం.