ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PRC issue: ఐఆర్‌ ఇస్తున్నదే 27%.. ఫిట్‌మెంట్‌ 14.29% అంటే ఎలా?

employees oppose prc report: అధికారుల కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదికను ఆమోదించబోమని, ఇది ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. పీఆర్సీ కమిషనర్‌ అశుతోష్‌ మిశ్ర నివేదికను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్​ చేశాయి.

ఐఆర్‌ ఇస్తున్నదే 27%.. ఫిట్‌మెంట్‌ 14.29% అంటే ఎలా?
ఐఆర్‌ ఇస్తున్నదే 27%.. ఫిట్‌మెంట్‌ 14.29% అంటే ఎలా?

By

Published : Dec 15, 2021, 5:03 AM IST

Updated : Dec 15, 2021, 6:40 AM IST

employees fire on prc: అధికారుల కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదికను ఆమోదించబోమని, ఇది ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. పీఆర్సీ కమిషనర్‌ అశుతోష్‌ మిశ్ర నివేదికను యథాతథంగా అమలు చేయాలని డిమాండు చేశాయి. పీఆర్సీపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో మంగళవారం విడివిడిగా చర్చించారు. ఫిట్‌మెంట్‌ 55% ఉండాలని ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి కోరగా.. 34%కు తగ్గకుండా చూడాలని సచివాలయ ఉద్యోగుల సంఘం విన్నవించింది. ప్రస్తుతం ఐఆర్‌ 27% ఇస్తూ.. ఫిట్‌మెంట్‌ 14.29% అంటే ఎలాగని ప్రశ్నించాయి. పీఆర్సీతో పాటు 70 డిమాండ్లు నెరవేరిస్తేనే ఉద్యమాన్ని విరమిస్తామని ఐకాసలు స్పష్టం చేశాయి. సీఎస్‌ ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఆర్థికశాఖ అధికారులతో చర్చించి నివేదిక ఇవ్వడాన్ని తప్పుబట్టాయి. సజ్జలతో చర్చల అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వానికే ఆర్థిక వెసులుబాటు

‘సీఎస్‌ కమిటీ నివేదిక ఉద్యోగులకు మేలు చేసేలా లేదు.. అది ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు కల్పించేలా ఉంది. పీఆర్సీ నివేదికను యథాతథంగా అమలుచేయాలి. ప్రస్తుతం ఐఆర్‌ 27% ఇస్తుంటే.. 14.29% ఫిట్‌మెంట్‌కు సిఫార్సు చేయడమేంటి? సీఎస్‌ ఉద్యోగ సంఘాలను సంప్రదించడం ఆనవాయితీ. అలాకాకుండా ఆర్థికశాఖ అధికారులతో కలిసి నివేదిక రూపొందించారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశాం. జులై 2018 నుంచి 55% ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతుంటే.. అక్టోబరు 2022 వరకు లబ్ధి ఇవ్వడానికి లేదని నివేదికలో చెప్పారు. అధికారుల నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పాం. ఫిట్‌మెంట్‌ 55% కోరాం. అపరిష్కృతంగా ఉన్న సీపీఎస్‌, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, పొరుగుసేవల ఉద్యోగుల సమస్యల్లాంటి 70 డిమాండ్లను నెరవేర్చేలా చూడాలని చెప్పాం. అంతవరకూ ఉద్యమం కొనసాగుతుంది’ - ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు

ఐఆర్‌ 27% ఉంటే తగ్గిస్తారా?

‘ఇప్పటికే ఉద్యోగులకు 27% ఐఆర్‌ ఇస్తుండగా.. 14.29% ఫిట్‌మెంట్‌తో తగ్గిస్తారా? దాన్ని అంగీకరించలేదు. దీంతో 13లక్షల మంది ఉద్యోగులు నష్టపోతారు. 2018 జులై నుంచి పీఆర్సీ అమలుచేయాలి. ప్రస్తుతం ఫిట్‌మెంట్‌, ఆర్థిక ప్రయోజనాల అమల్లో తేడాలున్నాయి. సీఎంతో చర్చల్లో దీనిపై స్పష్టత కోరతాం. 55% ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతున్నాం. డిమాండ్లు నెరవేర్చేలా ఒప్పంద రూపంలో ఇస్తే తప్పకుండా ఉద్యమంపై నిర్ణయం తీసుకుంటాం. ఈ నెల 16, 21, 27, 30 జనవరి 3, 6 తేదీల్లో జరిగే ఆందోళనలు, సమావేశాలు కొనసాగుతాయి. ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ ఎక్కువ ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరాం’ - ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఒప్పంద, పొరుగుసేవల వారికి న్యాయం చేయాలి

‘అధికారుల కమిటీ పీఆర్సీ సిఫార్సులు ఉద్యోగులు ఆశించినట్లు లేవు. ఆర్థిక ప్రయోజనాలను 2019 జులై నుంచి ఇవ్వాలని కోరాం. 34% తగ్గకుండా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, ఐఆర్‌ కంటే ఎక్కువ ఇవ్వడం సంప్రదాయంగా వస్తోందని చెప్పాం. ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరాం. సీఎం జగన్‌ మంచి ఫిట్‌మెంట్‌ ఇస్తారని ఆశిస్తున్నాం’ - సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి

ఫిట్‌మెంట్‌ 50% ఇవ్వాలి

‘ఉద్యోగులకు 50% ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరాం. 2018 నుంచి ఫిట్‌మెంట్‌, ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని విన్నవించాం. సీఎం నిర్ణయం తీసుకోవాలని కోరాం. ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చలు బుధవారం ఉంటాయని భావిస్తున్నాం. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో ఉన్న సభ్య సంఘాలతో సీఎం సమావేశం ఉంటుంది’ - ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ

పీఆర్సీతో ఉద్యమం చల్లబడదు

‘ఈ ఉద్యమం పీఆర్సీతో చల్లబడదు. 70 సమస్యలు పరిష్కరించే వరకూ కొనసాగుతుంది. సీఎస్‌ కమిటీ పీఆర్సీపై నివేదిక ఇచ్చే సంప్రదాయం గతంలో లేదు. ఉద్యోగుల 70 డిమాండ్లలో 50-60 ముఖ్యకార్యదర్శుల స్థాయిలోనే పరిష్కారమవుతాయి. దీన్ని సజ్జల దృష్టికి తీసుకువెళ్లాం’ - ఏపీ ఐకాస ప్రధాన కార్యదర్శి హృదయరాజు

ప్రభుత్వం స్పందించకపోతే రెండో ఉద్యమం

‘ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ప్రాంతీయ సదస్సుల్లో రెండో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం. ఉద్యోగుల డిమాండ్లలో 30-40 వాటికి ఆర్థికంతో పని లేదు. వీటిని అధికారులే పరిష్కరించవచ్చు. ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది. అప్పటికీ¨ ప్రభుత్వం స్పందించకపోతే రెండో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం. ఉద్యోగుల డిమాండ్లన్నీ నెరవేరేవరకూ ఉద్యమం కొనసాగిస్తాం’ - ఐకాస అమరావతి ప్రధాన కార్యదర్శి వైవీ రావు

ఇదీ చదవండి:

SAJJALA ON CPS ISSUE: సాంకేతిక అంశాలు తెలీకే సీఎం సీపీఎస్​ రద్దు హామీ ఇచ్చారు: సజ్జల

Last Updated : Dec 15, 2021, 6:40 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details