కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్డౌన్ ప్రజలందరికీ షాక్ ఇస్తే ..రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పెంచి ప్రభుత్వం ప్రజలకు మరో షాక్ ఇచ్చింది. మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు పది రెట్లు పెంచుతూ రావటం వల్ల గృహ వినియోగదారులందరికీ ఊహించని విద్యుదాఘాతం తగిలింది. గత నెలలతో పోలిస్తే పది రెట్ల మేర బిల్లులు రావటంతో రాష్ట్రవ్యాప్తంగా గృహ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. వినియోగించిన యూనిట్లకే బిల్లులు వేశామని డిస్కమ్ కంపెనీలు చెబుతున్నా.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి అమలు చేయాల్సిన టారిఫ్‌ను డిస్కమ్ సంస్థలు గుట్టుచప్పుడు కాకుండా అమలు చేసేశాయి. మార్చి, ఏప్రిల్ నెలలకు చెల్లించాల్సిన యూనిట్లన్నీ ఒకే సారి వినియోగదారుడి నెత్తిన బిల్లుల రూపంలో రుద్దేశాయి. వాస్తవానికి రెండు నెలలకూ రెండు వేర్వేరు టారిఫ్‌లు వర్తించాల్సి ఉంది. దీనికితోడు రెండు నెలలకు సంబంధించిన వేలాది రూపాయల బిల్లులును ఒకేసారి చెల్లించాల్సిందిగా మూడు డిస్కమ్ కంపెనీలు వినియోగదారులపై భారం మోపాయి.
లాక్డౌన్ వేళ వినియోగదారులకు విద్యుత్ 'షాక్'
లాక్ డౌన్ ముగియకుండానే ఆంధ్రప్రదేశ్‌లో డిస్కమ్‌లు.. గృహ వినియోగదారులపై విద్యుత్ బిల్లుల మోత మోగించటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్ వినియోగం పక్కన పెడితే .. గతంలో కంటే ఈసారి బిల్లులు పది రెట్లు పెరిగిపోవటంతో గృహ వినియోగదారులంతా గగ్గోలు పెడుతున్నారు. మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన బిల్లులను ఒకే దఫా చెల్లించాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు గృహ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. ఛార్జీలు ఏ మాత్రం పెంచలేదని విద్యుత్ శాఖ చెబుతున్నా.. బిల్లులు మాత్రం పది రెట్లు పెరిగి రావటంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
వాస్తవానికి ఏప్రిల్ నెలలో డిస్కమ్ కంపెనీలు మీటర్ రీడింగ్ తీసి బిల్లులను ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ నెలకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మీడర్ రీడింగ్ నిలిపివేసిన విద్యుత్ సంస్థలు .. బిల్లు చెల్లింపులు ఆలస్యం అయిన కారణంగా విధించే డిస్ కనెక్షన్ చార్జీలు ఇతర కస్టమర్ ఛార్జీలను, పెనాల్టీని గృహ వినియోగదారుడికి వడ్డించేశాయి.
లాక్డౌన్ కారణంగా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడటంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గింది. ఏపీ ట్రాన్స్‌కో ఇతర రాష్ట్రాల నుంచి చేసే విద్యుత్ కొనుగోళ్లు కూడా ఆ మేరకు తగ్గాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈఆర్సీ ఆమోదించిన కొత్త టారిఫ్, స్లాబ్ రేట్లు మారిన విషయాన్ని రహస్యంగా ఉంచేసిన డిస్కమ్‌లు.. ఇప్పుడా భారాన్ని నేరుగా వినియోగదారుడి నెత్తిన పడేశాయి.