కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డాటా సైన్సెస్ వంటి సాంకేతికతల ఆవశ్యకత, ప్రయోజనాలను ప్రభుత్వం గుర్తించి పలు విభాగాల్లో విస్తృతంగా వినియోగిస్తోంది. వీటిలో కృత్రిమ మేధకు ఉన్న ప్రాధాన్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 2020 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ఇంటెలిజెన్స్‌గా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ అధునాతన టెక్నాలజీకి అటు ప్రభుత్వం, పరిశ్రమలు, అకాడమీ ఇస్తోన్న ప్రాధాన్యం.. ఈ రంగంలో భవిష్యత్తు అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఈనాడు - సాఫ్ట్వేర్ అసోసియేషన్ బాడీ హైసియా కృత్రిమ మేధ(ఏఐ) - విద్య, ఉద్యోగ అవకాశాలపై సంయుక్తంగా వెబినార్ నిర్వహించాయి.
ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ఈ వెబినార్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైసియా అధ్యక్షుడు భరణి కుమార్ అరోల్, హ్యూసిన్ ఫౌండర్- సీనియర్ హెచ్ఆర్ నిపుణులు జీఆర్ రెడ్డి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వెబినార్‌కు ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ రమేశ్ లోగనాథన్ సమన్వయ కర్తగా వ్యవహరించారు.
2 ఏళ్లు.. 30వేల ఉద్యోగాలు
ఎమర్జింగ్ టెక్నాలజీస్‌ను అందిపుచ్చుకోవటంలో తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. కొవిడ్ తర్వాత సాంకేతికత వినియోగంలో వేగం పెరిగిందని.. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నియంత్రణకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు. అన్ని రంగాల్లో ఏఐ కీలకపాత్ర పోషిస్తోందని.. రాబోయే రోజుల్లో లీడింగ్ టెక్నాలజీగా ఏఐ అవతరిస్తుందని వెల్లడించారు. ఏఐ ద్వారా 19 రకాల ఉద్యోగాలు సాకారమవుతున్నాయని.. రాబోయే రెండేళ్లలో 30 వేల ఉద్యోగాలు ఈ విభాగంలో రానున్నాయని జయేశ్ ప్రకటించారు.
సాంకేతికత అప్‌గ్రేడ్‌తో ఉద్యోగ భద్రత
జేఎన్‌టీయూ ఇప్పటికే ఏఐలో స్పెషలైజేషన్ కోర్సు అందిస్తుండగా.. మరిన్ని కళాశాలలు, ప్రైవేటు యూనివర్సిటీలు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆధారిత కోర్సులను ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయని జయేశ్ తెలిపారు. ఏఐ రంగంలో యువతకు అపార అవకాశాలున్నాయని.. ఉజ్వల భవిష్యత్‌ను సాకారం చేసే నూతన సాంకేతికతను యువత అప్‌గ్రేడ్ చేసుకోవాలని.. వీటిపై మరింత అవగాహనకు పాటుపడేలా హైసియా- ఈనాడు చొరవ తీసుకొని అవకాశాలపై వెబినార్ నిర్వహించడాన్ని జయేశ్ అభినందించారు.