ఎమ్మెల్సీల లేఖలకు సమాధానాలు ఇవ్వడం లేదని, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలను చులకనగా చూస్తున్నారంటూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు చిన వీరభద్రుడిపై ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, శ్రీనివాసులురెడ్డి, కత్తి నరసింహారెడ్డి, రఘువర్మ, వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో మంగళవారం జాతీయ విద్యా విధానం అమలుపై మంత్రి ఆదిమూలపు సురేష్ అధ్యక్షతన అధికారులు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు.
విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలు అమలు చేయటం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు విద్యార్ధులు పోటీ పడేలా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ప్రాథమిక విద్య వ్యవస్థను పటిష్టంగా అమలుపర్చడం ద్వారా తొలిదశలోనే పటిష్టమైన పునాది పడుతుందని అభిప్రాయం వ్యక్తమైంది.
పూర్వప్రాథమిక విద్య ఎల్కేజీ, యూకేజీ లను పీపీ-1, పీపీ-2 తరహా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు వచ్చాయని మంత్రి వివరించారు. పూర్వ ప్రాథమిక విద్య నుంచి (+2) ఇంటర్మీడియట్ స్థాయి వరకూ విద్యను అందించే అరు అంచెల నూతన విద్యా విధానంపైనా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భౌతిక, మానవ వనరుల్ని సమర్ధంగా వినియోగించుకునేలా మూడు అంచెల్లో ఫౌండేషన్ పాఠశాలలు మరో మూడు అంచెల్లో ఉన్నత పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నది కేంద్రం నిర్ణయమన్నారు.
జూనియర్ కళాశాలలు లేని మండలాల్లోని 202 హైస్కూళ్లలో పదో తరగతి అనంతరం 11, 12 తరగతుల నిర్వహణను వచ్చే ఏడాది నుంచే నిర్వహించేందుకు అమలు చేయనున్నట్టు మంత్రి వివరించారు. ఈ ముసాయిదా ప్రతిపాదనల్లో మార్పులు చేర్పులు, అభ్యంతరాలను ఎమ్మెల్సీలు మంత్రికి అందజేశారు.