రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా విధానాన్ని నవంబరు ఒకటి నుంచి అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా 250 మీటర్ల దూరంలోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. ఉన్నత పాఠశాలలకు నిర్ణీత దూరంలోని ప్రాథమిక పాఠశాలల గుర్తింపు, విద్యార్థుల తరలింపు, అర్హులైన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ఈనెల 31నాటికి పూర్తి చేసే బాధ్యతను డీఈవోలకు అప్పగించారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో బహుళ తరగతులను నిర్వహిస్తుండటంతో అభ్యసన ఫలితాలు సక్రమంగా లేవని, 1-5 తరగతులకు ఒకరిద్దరు ఉపాధ్యాయులే బోధిస్తున్నందున 18 సబ్జెక్టులను కవర్ చేయలేకపోతున్నారని విద్యాశాఖ పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు 3-5 తరగతులకు సబ్జెక్టు ఉపాధ్యాయులు, 1-2 తరగతులకు ప్రత్యేక ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది.
ఇదీ విధానం
- ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను 250 మీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. 1, 2 తరగతులు యధావిధిగా కొనసాగుతాయి.
- 1, 2 తరగతులకు బోధించేందుకు ఎస్జీటీలను 1:30 నిష్పత్తిలో నియమిస్తారు.
- ఎస్జీటీల్లో జూనియర్‌ను 1, 2 తరగతుల బోధనకు వినియోగిస్తారు. సీనియర్ ఎస్జీటీల్లో 3-10 తరగతులకు బోధించే అర్హతలు లేకుంటే ఆ అర్హతలున్న జూనియర్‌కు అవకాశమిస్తారు.
- 3-10 తరగతులకు ఉన్నత పాఠశాలల్లోని సబ్జెక్టు ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల నుంచి వచ్చిన వారు బోధిస్తారు.
- ఉన్నత పాఠశాలల్లో 3-10 తరగతుల నిర్వహణకు సరిపడా గదులు లేకుంటే... ప్రాథమిక పాఠశాల గదుల్లోనే 3, 4, 5 తరగతులను కొనసాగిస్తారు.