పాఠశాలలతో పాటు ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు కొవిడ్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఆగష్టు 16వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి కళాశాలలు ప్రారంభించిన దృష్ట్యా.. గురువారం విద్యా శాఖామంత్రి అదిమూలపు సురేష్, విద్యా శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖాధికారులతో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో గల కొవిడ్ పరిస్టితులను విశ్లేషణ చేస్తూ, ఇప్పటివరకు వాక్సిన్ వేయించుకున్న ఉపాధ్యాయుల వివరాలు మరియు ప్రస్తుతం కొవిడ్(covid) పాజిటివ్‌గా నమోదైన విద్యార్ధులు, ఉపాధ్యాయుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 97.5 శాతం ఉపాధ్యాయులకు టీకా వేశారని.. మిగిలిన 7,388 మందికి మాత్రమే టీకా వేయాల్సి ఉండగా.. 100 శాతం పూర్తి చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.