ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అన్ని క్యూలైన్లలో భక్తులు పోటెత్తుతున్నారు. ఉచిత దర్శనం, 100 రూపాయల దర్శనంతో పోలిస్తే 300 రూపాయల క్యూలైన్ లోనే ఎక్కువ సేపు ఉండాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న సాయంత్రం భక్తజనసందోహం నడుమ నగరోత్సవం కన్నులపండువగా సాగింది. భక్త బృందాల కోలాటాలు, మేళతాళాలు, వాద్యాలతో మల్లేశ్వరాలయం నుంచి కనకదుర్గ నగర్, అర్జున వీధి, ఘాట్ రోడ్డు మీదుగా ఆలయం వరకు నగరోత్సవం సాగింది.
కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. కర్నూలులోని అమ్మవారి దేవాలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. స్వర్ణగౌరీ అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఎమ్మిగనూరులో దసరా ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. నంద్యాలలోని బ్రహ్మనందీశ్వర స్వామి ఆలయంలో శ్రీకూష్మాండదేవి, శ్రీ మాణిక్యాంబదేవి రూపాల్లో అమ్మవారు దర్శనమిచ్చారు. శ్రీకాళికాంబ ఆలయంలో అమ్మవారిని గాజులతో అలంకరించారు.
గుంటూరు ఆర్.అగ్రహారంలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి భక్తులు వేలాదిగా పోటెత్తారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ దర్శించుకున్నారు. కడపలో గజలక్ష్మీదేవి రూపంలో ఉన్న అమ్మవారిని 25 లక్షల రూపాయలు విలువ చేసే నోట్లతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని వేర్వేరు ఆలయాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు కనువిందు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు - undefined
రాష్ట్రవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేర్వేరు రూపాల్లో ఉన్న అమ్మవారిని భక్తులు తమ కళ్లనిండా నింపుకుని తరించిపోతున్నారు. ఇంద్రకీలాద్రిలో కన్నుల పండువగా నగరోత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారిని అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు