రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. నవరాత్రులలో చివరి రోజు కావడం వల్ల అమ్మవారిని విశేషంగా అలంకరించారు. విజయదశమి పర్వదినాన అమ్మవారిని పూజిస్తే సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
కృష్ణా జిల్లాలో దసరా వేడుకలు
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ లబ్బీపేటలోని షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలోని అమ్మవారి విగ్రహానికి విశేష పూజలు నిర్వహించారు. గారపాటి కోటేశ్వరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30 లక్షల రూపాయల నగదుతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
విశాఖలో...
విజయదశమి సందర్భంగా విశాఖలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని ప్రముఖ సంపత్ వినాయక దేవాలయంతో పాటు కనకమహాలక్ష్మి అమ్మవారు దేవస్థానం, కన్యకాపరమేశ్వరి దేవస్థానాల్లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. కనకమహాలక్ష్మి అమ్మవారుని స్వర్ణాభరణాలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవతా మూర్తులను దర్శించుకున్నారు.
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి గాంచిన అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలవిరాట్‌కు పంచామృతాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి వి సత్యవతి దంపతులు, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ దంపతులు, వైకాపా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ దంపతులు పాల్గొన్నారు.