కరోనాతో ఈ ఏడాది పండుగలు...ఇళ్లల్లోనే చేసుకోవాల్సి వచ్చింది. జనం ఇంటిపట్టునే ఉండడం వల్ల... కొంతకాలంగా వ్యాపారాలు వెలవెలబోయాయి. ఆంక్షల సడలింపుతో మళ్లీ ఈ దసరా పండుగతో సందడి వాతావరణం ప్రారంభమైంది. కొత్త దుస్తులు, ఆకట్టుకునే గృహోపకరణాల ఆఫర్లకు జనం బయటకు వస్తుండడం వల్ల...మార్కెట్ల జోరు ఊపందుకుంది. ఇక దసరా అంటే ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు కొనుగోలు చేసి ఆయుధ పూజ చేయటం ఆనవాయితీ. ఈ సెంటిమెంట్‌తో వ్యాపారులు వినియోగదారుల్ని ప్రత్యేక ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు. దీంతో టీవీ, ఫ్రిజ్, వాషింగ్‌మిషన్ల కొనుగోళ్లు భారీగానే పెరిగాయి.
కరోనాతో జరిగిన నష్టం నుంచి...పుంజుకోగలుగుతున్నామని వ్యాపారస్తులు చెబుతున్నారు. వస్త్ర, బంగారం, గృహోపకరణాల దుకాణాల్లో కొనుగోలుదారుల సందడి మొదలైంది. మార్చి నుంచి వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించటం వల్ల....ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడిప్పుడే ప్రజలు బయటకు వస్తున్నారని....వ్యాపారాలపై భరోసా కలుగుతోందని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ-కామర్స్ సంస్థలు పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తుండటం వల్ల...కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు.