అమ్మవారి రథం సింహాలు మాయమైన కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు . ఇంద్రకీలాద్రిపై ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులు రెండేళ్లుగా సాగుతున్నాయి . ఈ నిర్మాణ పనుల కోసం బిహార్ తో పాటు .. ఇతర ప్రాంతాల నుంచి కార్మికులు వచ్చారు. వారందరికీ ఆలయ ప్రాంగణంలోనే బస ఏర్పాటు చేశారు .లాక్ డౌన్ లోనూ ఆలయ పనులు చేపట్టారు. 15 రోజుల క్రితమే పనులు పూర్తి చేసుకుని కార్మికులు వారి సొంత ప్రాంతాలకు వెళ్లారు . వారు ఉన్నంత కాలం ఆలయ ప్రాంగణంలో అన్నిచోట్లకూ వెళ్లేవారు. పోలీసులు ప్రస్తుతం వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టి విచారణ సాగిస్తున్నారు.
ఈ కేసులో ఇంటి దొంగల హస్తం ఏమైనా ఉందా ? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు . ఆలయంలో గతంలో జరిగిన కొన్ని చిన్న దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్న కిందిస్థాయి సిబ్బందిని కూడా విచారిస్తున్నారు . రాష్ట్రంలో ఈ తరహా లో దొంగతనాలు చేసే ముఠాలు, అనుమానితుల జాబితాను పరిశీలిస్తున్నారు. గత ఏడాది ఉగాదికి శ్రీగంగాపార్వతీ సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ఈ రథం పై ఊరేగించారు . అప్పుడు రథం పై సింహం విగ్రహలు ఉన్నాయి . ఈ ఏడాది ఉగాదికి కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో అమ్మవారిని వెండి రథంపై ఊరేగించలేదు. ఉత్సవాలకు ముందు ఈ రథాన్ని ఆలయ సిబ్బంది పరిశీలించినట్టు పోలీసు విచారణలో తేలింది.