విజయవాడ దుర్గగుడిలో రెండేళ్ల కిందట చీరల స్కాం జరిగింది. చీరల కౌంటర్‌లో ఉండే సిబ్బంది చేతివాటం చూపించారు. గత ఈవో సురేష్‌బాబు నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీతో అంతర్గత విచారణ కూడా చేపట్టారు. అప్పటి దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధ, ఈవో సురేష్‌బాబు స్వయంగా పలుసార్లు చీరల కేంద్రాన్ని పరిశీలించి.. విచారణ చేపట్టారు. చివరికి రూ.11.78లక్షలు పక్కదారిపట్టినట్టు లెక్కలు తేల్చారు. పక్కదారి పట్టిన డబ్బులను దేవస్థానానికి కట్టిస్తామని, బాధ్యులపై చర్యలు చేపడతామని ప్రకటించారు. కానీ.. కనీసం పోలీసు కేసు కూడా పెట్టలేదు. ఆ తర్వాత ఈ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. దేవస్థానానికి రావాల్సిన డబ్బుల్లో ఎంత వసూలు చేశారో.. ఎంత వదిలేశారో కూడా ఎవరికీ తెలియదు. దుర్గగుడికి వచ్చే ఆదాయం ఏళ్ల తరబడి పక్కదారి పడుతూనే ఉంది. అక్రమాలను గుర్తించినా.. అమ్మవారి సొమ్మును వెనక్కి రప్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు.
రూ.76 లక్షలని తొలుత తేల్చి..
దుర్గగుడిలో జరిగిన చీరల స్కాంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్టు ఆరంభంలో గుర్తించారు. వాస్తవంగా అయితే.. రూ.76 లక్షల వరకు పక్కదారి పట్టినట్టు తొలుత అధికారులే ప్రకటించారు. కానీ.. నెలల తరబడి విచారణ చేసిన తర్వాత చివరికి రూ.11.78లక్షలని తేల్చారు. విచారణలో అనేక అక్రమాలు బయటపడ్డాయి. తక్కువ రకం చీరలకు అధిక ధరల స్టిక్కర్లు అంటించారు. ఖరీదైన చీరలను మాత్రం పక్కదారి పట్టించి.. బయట మార్కెట్‌లో అమ్ముకున్నారు. చాలామంది భక్తులు అమ్మవారి కోసం ఖరీదైన చీరలను ఇస్తారు. అలాంటి వాటిని మాయం చేసి.. తక్కువ రకానివి ఆ స్థానంలో ఉంచారు.
స్టిక్కర్లు మాత్రం అధిక ధరలవి అంటించేశారు. ఇలా ఏకంగా 2500కు పైగా ఖరీదైన చీరలను మార్చేసినట్టు అధికారులు గుర్తించారు. 2018 నుంచి ఈ అక్రమ తంతు చేస్తూ.. భక్తులకు వాటిని అధిక ధరలకు విక్రయించాలని చూశారు. కానీ.. అంత ధరలు ఆ చీరలకు ఉండవని తెలిసిన భక్తులెవరూ వాటిని కొనుగోలు చేయలేదు. దీంతో అవన్నీ గోదాములో ఉండిపోవడంతో.. స్కాం బయటపడింది. దీనికితోడు చీర ముక్కలతో సంచులు కుట్టిస్తామని, పని చేసే కుర్రాళ్లకు జీతాలు ఇవ్వాలని చెప్పి దేవస్థానం డబ్బులను మరికొంత డ్రా చేసుకుని.. సొంత జేబుల్లో వేసుకున్నారు.