దుబాయిలో 19 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగి పట్ల ఆ సంస్థ ఉదారత చాటుకుంది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్‌కు చెందిన బత్తిని మల్లయ్య దుబాయిలోని ప్రోస్కేప్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇటీవల బ్రెయిన్ ట్యూమర్‌తో అనారోగ్యం పాలయ్యాడు. కంపెనీలో విధుల్లో ఉండగానే పడిపోవటంతో యాజమాన్యం అస్పత్రిలో చేర్పించి సుమారు రూ.90 లక్షలు (4.35 లక్షల ధిరమ్స్) వెచ్చించి వైద్యం చేయించింది.
మల్లయ్య భార్య అభ్యర్థన మేరకు స్వదేశానికి పంపేందుకు అంగీకరించింది. ఇక్కడి నుంచి అనుమతి లభించాల్సి ఉండటంతో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ క్రిష్ణభాస్కర్ స్పందించి లేఖ రాశారు. దీంతో దుబాయి నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు సంస్థ యాజమాన్యం పంపించింది. శనివారం స్వదేశానికి చేరుకున్న మల్లయ్య ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దుబాయిలోని ఎల్లాల శ్రీనన్న సేవాసమితి ప్రతినిధులు చిలుముల రమేశ్, ఆరెల్లి రమేశ్ బాధితుడి తరలింపును సమన్వయం చేసినట్లు వెల్లడించారు.