మందుబాబులను నియంత్రించే డ్రంకెన్ డ్రైవ్‌ను పోలీసులు నిలిపేయడం సామాన్యుల్లో గుబులు రేపుతోంది. విజయవాడ నగరంలో రాత్రి 11 గంటల వరకూ మద్యం అమ్మకాలు సాగుతుండగా బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం సేవించిన వారు చాలామంది సొంతంగానే వాహనాలు నడుపుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. అలాంటి వారికి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిలిపేసిన వేళ ప్రత్యామ్నాయ చర్యలు ఏం చేపట్టాలనేది ప్రశ్నార్థకంగా మారింది. మోతాదుకు మించి మద్యం సేవిస్తున్న పలువురు రెండు, మూడు కిలోమీటర్లలో ఇంటికి చేరొచ్చనే భావనతో బైకులు, కార్లపై వేగంగా వెళ్తున్నారు. మలుపులు, ఎత్తుపల్లాల వద్ద నియంత్రణ కోల్పోయి, కొన్నిసార్లు రాంగ్‌రూట్‌లో సైతం వెళ్తూ ప్రమాదాలు చేస్తున్నారు. పటమట, పెనమలూరు, పోరంకి, చిట్టినగర్, ఎంజీరోడ్డు, రామవరప్పాడు, సింగ్‌నగర్, భవానీపురం, కృష్ణలంక, కరెన్సీ నగర్, మాచవరం ప్రాంతాల్లో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
పోరంకిలో 15 రోజుల క్రితం ఓ యువకుడు ఇదే రీతిలో రోడ్డుపై నిలిపి ఉంచిన 3 ద్విచక్ర వాహనాలను కారుతో ఢీకొట్టాడు. విదేశాలకు వెళ్తున్నందున, కేసు పెడితే తన జీవితం నాశనం అవుతుందని బాధితుల్ని వేడుకొని రాజీ కుదుర్చుకున్నాడు. ఇటీవల నేతాజీ వంతెన కూడలి వద్ద ఓ లారీ డ్రైవర్ రోడ్డుపై వెళ్లే వారిని చిరునామా అడుగుతున్నాడు. ఆ సమయంలో అతడు ఏం చేస్తున్నాడో తెలీనంత మత్తులో ఉన్నాడు. ఈ పరిస్థితులను నివారించాల్సిన పోలీసులు ప్రమాదాలు జరిగినపుడు పరీక్షలు చేస్తామని చెబుతున్నారు.