విజయవాడ నగరంలో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. రెండేళ్లుగా విద్యార్థులకు విదేశీయులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. టాంజానియా, సుడాన్ నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారు. సంపన్నవర్గాల విద్యార్థులే లక్ష్యంగా ఈ దందా సాగుతోంది. సాధారణంగా రాష్ట్ర పోలీసు రికార్డుల్లో గంజాయి, బ్రౌన్ షుగర్ వంటివే తప్ప... కొకైన్, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలు చేరలేదు. కానీ ఈ రేంజ్‌లో డ్రగ్స్ పట్టుబడటం... సరఫరా చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కడం... నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది.
విద్య పేరిట విదేశాల నుంచి వస్తున్న కొందరు... కాసులకు కక్కుర్తిపడి మాదకద్రవ్యాల విక్రయాలతో జేబులు నింపుకుంటున్నారు. తాజాగా పట్టుబడిన నైజీరియన్లు కూడా... విజయవాడలో తమ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఇక్కడ మకాం వేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. వీరి నుంచి కేవలం 14 గ్రాముల హెరాయిన్, రెండున్నర కిలోల గంజాయి మాత్రమే దొరికినప్పటికీ... ఇంకా ఎవరి వద్దనైనా మాదకద్రవ్యాలు ఉన్నాయా... వీరికి ఎవరెవరితో సంబంధాలున్నాయనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు.