ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేతల కవ్వింపులు.. డ్రోన్‌ షూటింగ్‌లు... కరకట్ట వద్ద హైడ్రామా - chandrababu house

చంద్రబాబు నివాసంపై డ్రోన్‌ ప్రయోగించడం భద్రతాపరంగానూ, రాజకీయపరంగానూ తీవ్ర కలకలం రేపింది. జగన్‌ వద్ద పనిచేసే కిరణ్‌ అనే వ్యక్తి ఆదేశాలతోనే ఈ పని చేశామంటూ వచ్చిన వారు చెప్పడం దుమారం రేపింది. తెలుగుదేశం శ్రేణులు, అటు పోలీసుల రాకతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

నేతల కవ్వింపులు... డ్రోన్‌ షూటింగ్‌లు... కరకట్ట వద్ద హైడ్రామా

By

Published : Aug 16, 2019, 8:24 PM IST

నేతల కవ్వింపులు... డ్రోన్‌ షూటింగ్‌లు... కరకట్ట వద్ద హైడ్రామా

అమరావతిలో చంద్రబాబు నివాసం వద్ద ఉదయం నుంచి హైడ్రామా నడిచింది. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, బాపట్ల ఎంపీ నందిగాం సురేష్‌ ఒకరి తర్వాత ఒకరుగా వరద పరిశీలన అంటూ చంద్రబాబు నివాసం వద్ద హడావిడి చేశారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ తెలుగుదేశం నేతలు అక్కడకు చేరుకున్నారు. ఈలోగా ఇద్దరు యువకులు చంద్రబాబు నివాసం పైకి డ్రోన్‌ ప్రయోగించారు. భద్రతా దళాలు వీరిని అడ్డుకుని ప్రశ్నించాయి. జగన్ వద్ద పనిచేసే వారు తమను పంపారని వారు ఇచ్చిన వాంగ్మూలం సమస్యను జఠిలం చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని తామే షూట్ చేసామని అక్కడి వ్యక్తులు బదులిచ్చారు. జగన్ వద్ద పని చేసే కిరణ్ అనే వ్యక్తి ఆదేశాలతోనే ఈ పని చేశామని చెప్పారు.

ప్రభుత్వ పెద్దలనుంచి భద్రతాదళాలకు ఫోన్‌కాల్‌ రావడంతో వారిని వదిలిపెట్టేశారు. ఆ సమయంలోనే తెలుగు యువత అధ్యక్షుడు అవినాష్‌, ఆయన అనుచరులు వారిని వెంబడించి పట్టుకున్నారు. అక్కడ ఏం పని అంటూ నిలదీశారు. వారిని పోలీసులు అడ్డుకుని... ఆ కుర్రాలను అదుపులోకి తీసుకున్నారు. తాము విచారణ చేస్తామంటూ నచ్చ చెప్పే ప్రయత్నించారు. ఈ చర్యను తెలుగుదేశం నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. నిజాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని వారితో వాగ్వాదానికి దిగారు. వారిని కదలనీయకుండా పోలీస్‌ వాహనానికి అడ్డంగా నిలుచున్నారు.

ఈ క్రమంలోనే ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకానొక దశలో తోపులాట జరిగింది. తెలుగుదేశానికి మద్దతుగా రాజధాని రైతులు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చర్చలు ఫలించకపోయేసరికి పోలీసులు లాఠీ ఛార్జీచేశారు. వాహనాలకు అడ్డంగా నిల్చున్న నాయకులను పక్కకు లాగేశారు. సంఘటన చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులకు, రైతులకూ లాఠీ దెబ్బలు తగిలాయి. ఇలా బలవంతంగా ఇద్దరు యువకులను అక్కడి నుంచి తరలించారు.

తెలుగుదేశం నేతలు డ్రోన్‌ ప్రయోగించిన యువకులు ఉన్న పోలీస్‌జీప్‌ను చుట్టుముట్టిన సమయంలో పలువురు వైకాపా నేతలు అక్కడకు చేరుకుని ఆళ్ల రామకృష్ణారెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. తెలుగుదేశం నేతలు వారిపై దాడికి దిగి అక్కడ నుంచి నెట్టుకెళ్లారు. పోలీసులు జోక్యం చేసుకుని వారినీ పంపేశారు.

ఇదీ చదవండి :

'మాజీ ముఖ్యమంత్రి ఔట్ ​హౌస్​లో ఉంటారా?'

ABOUT THE AUTHOR

...view details