అన్నదానం చేసిన అంబులెన్సు డ్రైవర్లు
అనంతపురం ప్రభుత్వాసుపత్రిలోని రోగులు, వారి బంధువులకు ప్రైవేట్ అంబులెన్సు డ్రైవర్లు అన్నదానం చేశారు. లాక్డౌన్ కారణంగా ఆసుపత్రికి వచ్చిన రోగులు తిండి లేక ఇబ్బంది పడుతున్న తీరును చూసిన డ్రైవర్లు ఈరోజు వారందరికీ భోజనం పంపిణీ చేశారు.
అన్నదానం చేసిన అంబులెన్సు డ్రైవర్లు ఉదారత చాటిన మాజీ సర్పంచ్
లాక్డౌన్ కారణంగా పేద ప్రజల ఇబ్బందులు తొలగించాలనే లక్ష్యంతో ఓ మాజీ సర్పంచ్ స్వచ్ఛందంగా మూడు గిరిజన గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం కొత్త గాంధీనగర్, పాత గాంధీనగరం, నడివీధి గ్రామాలలో గిరిజనులకు మాజీ సర్పంచ్ అయిన నిరంజని దేవి 150 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు. తానే స్వయంగా కూరగాయల బస్తాలను భుజాన వేసుకుని కొండ కాలువలను దాటుతూ సహాయ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఉదారత చాటిన మాజీ సర్పంచ్ వెయ్యి కుటుంబాలకు కూరగాయలు పంపిణీ
లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తూర్పుగోదావరి జిల్లా కృష్ణునిపాలెం మాజీ సర్పంచి కన్నబాబు కూరగాయలు పంపిణీ చేశారు. కృష్ణునిపాలెం, వెంకటాపురం, రామన్నపాలెం, చిన్నూరు, కొత్తూరు, సంజీవయ్యనగరం గ్రామాల్లో సుమారు వెయ్యి కుటుంబాలకు కూరగాయలను అందించారు. స్థానిక తెదేపా నాయకులు, యువకులు ఆటోలపై ఇంటింటికి తిరిగి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
వెయ్యి కుటుంబాలకు కూరగాయలు పంపిణీ అండగా నిలుస్తున్న దాతలు
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో రెక్కాడితే గానీ డొక్కాడని వేల కుటుంబాల పేదలు గృహాలకే పరిమితమయ్యారు. వీరికి నిత్యావసర సరుకులు పంపిణీకి ఒకపక్క ప్రభుత్వం చేయూత నివ్వగా మరోవైపు దాతల నుంచి సహకారం అందుతోంది. ఇతర రాష్ట్రాలలో ఉద్యోగాలు చేస్తున్నవారు, సొంత గ్రామాలలో స్థిరపడినవారు పేదవారికి అండగా నిలుస్తున్నారు.
కార్మికుల ఆకలి తీరుస్తున్న చేగువేరా ఫౌండేషన్
లాక్డౌన్ కారణంగా పనిలేక ఆకలితో బాధపడుతున్న వలస కార్మికులకు తామున్నామంటూ ముందుకొచ్చారు చేగువేరా ఫౌండేషన్ సభ్యులు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని రోజువారి కూలీల పరిస్థితి ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా పూట గడవడం కష్టంగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి గూడూరు వచ్చి ఫ్యాక్టరీలలో పనిచేసే వలస కూలీలకు 14 రోజులపాటు భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు చేగువేరా పౌండేషన్ వ్యవస్థాపకుడు సురేష్ బాబు తెలిపారు.
కార్మికుల ఆకలి తీరుస్తున్న చేగువేరా ఫౌండేషన్ సబ్బులు, మాస్కులు పంపిణీ
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో పలువురు దాతలు పేదలకు కూరగాయలు అందించేందుకు ముందుకొచ్చారు. పట్టణంలో మాజీ కౌన్సిలర్ అమర బిందు వందలాది పేద కుటుంబాలకు ఆరు కిలోల కూరగాయలతో పాటు సబ్బు, మాస్కులు ఉచితంగా అందించారు. పట్టణానికి చెందిన స్వర్ణకారులు, విశ్వబ్రాహ్మణులు 10 కిలోల సన్న బియ్యంతో పాటు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ సీఐ సురేష్ బాబు లాంఛనంగా ప్రారంభించారు.
శానిటైజర్లు అందించిన మాజీ సైనికులు
చిత్తూరు జిల్లా పుంగనూరులో కరోనా వైరస్ నివారణ చర్యల్లో పాల్గొంటున్న పురపాలక కార్మికులకు, పోలీసులకు స్థానిక సాయి సేవాసంస్థ ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లు అందించారు. ఈనెల 14 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లుగా సంస్ధ అధ్యక్షుడు త్రిమూర్తి రెడ్డి వెల్లడించారు. కరోనా వైరస్ నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పురపాలక కమిషనర్ లోకేశ్వరవర్మ తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు కార్మికులకు సానిటైజర్లు, మాస్కలు అందించారు.
శానిటైజర్లు అందించిన మాజీ సైనికులు లాక్డౌన్ పూర్తయ్యే వరకు అన్నదానం
లాక్డౌన్ కారణంగా విశాఖ జిల్లా అరకు లోయలో పేదల ఆకలి తీర్చేందుకు పలువురు దాతలు తమ వంతు సహాయంగా అన్నదానం చేశారు. అరకు లోయ గిరిజన సంఘంతో పాటు స్థానిక యువత వివిధ సంక్షేమ అసోసియేషన్ల ఆధ్వర్యంలో పేదలకు భోజనం అందిస్తున్నారు. మరికొంతమంది రాత్రి సమయంలో ఇంటింటికి వెళ్లి భోజన ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. లాక్డౌన్ పూర్తయ్యేవరకు పేదల ఆకలి తీర్చేందుకు ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు దాతలు వెల్లడించారు.
లాక్డౌన్ పూర్తయ్యే వరకు అన్నదానం నిరాశ్రయులకు అండగా అన్న క్యాంటీన్లు
లాక్డౌన్ కారణంగా నిరాశ్రయులైన వారికి విశాఖ జిల్లా అనకాపల్లిలో అన్న క్యాంటీన్లను వసతి, భోజన సదుపాయలను కల్పిస్తున్నారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద ఉన్న 'అన్న క్యాంటీన్' భవనంలో కన్యకా పరమేశ్వరి దేవస్థానం సభ్యులు ప్రతిరోజు ఉచితంగా సుమారు 500 మందికి భోజనం అందిస్తున్నారు.
నిరాశ్రయులకు అండగా అన్న క్యాంటీన్లు మాతమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం సద్దికూళ్లపల్లెలో మాతమ్మ ఆలయంలో స్థానిక యువత ప్రత్యేక పూజలు చేశారు. కోరిన కోరికలు నెరవేర్చే ఇలవేల్పుగా భావించే మాతమ్మ తల్లిని భక్తులు కరోనా నుంచి ప్రజలను కాపాడాలంటూ వేడుకున్నారు. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన పేదల కోసం నిత్యావసర వస్తువులను అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. స్థానిక ఎస్ఐ సుమన్ పూజలో పాల్గొన్నారు.
మాతమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రతి లబ్ధిదారునికి రూ.1000 అందజేత
లాక్డౌన్ కారణంగా గిరిజన ప్రజలకు రూ.1000 చొప్పున అందించేందుకు ప్రభుత్వం సుమారు రూ.16.11 కోట్లు విడుదల చేసిందని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బీకే బాలాజీ వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 1,61,189 కుటుంబాలకు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి లబ్ధిదారునికి రేపు రూ.1000 చొప్పున అందజేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరికి రేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకి సూచించారు.
ప్రతి లబ్ధిదారునికి రూ.1000 అందజేత