వందేళ్లలో ఎప్పుడూ చూసి ఎరగనంత కష్టం తెచ్చిపెట్టింది... కరోనా. చిన్న పెద్ద తేడా లేదు. ఆ వైరస్ ధాటికి ప్రతి దేశం.... విలవిల్లాడుతోంది. అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి అయితే దయనీయంగానే మారింది. అక్కడి పరిస్థితుల గురించి ఏ రోజు ఏ వార్త వినాల్సి వస్తుందో అన్నంతగా కలవరపెడుతున్నాయి... అమెరికాలో కరోనా కేసులు. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యంలో స్థిరపడిన భారతీయులు, ముఖ్యంగా ప్రవాసాంధ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులూ ఎన్నో. దేశాలతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఉన్నాయి. ఆ విషయాలకు సంబంధించి... అమెరికా మాసెచూసెట్స్‌లో స్థిరపడిన ప్రముఖ తెలుగు వైద్యురాలు... డాక్టర్ మీనాక్షితో ఈటీవీ భారత్ ప్రత్యేక ఆన్‌లైన్ ముఖాముఖి.
- ఈటీవీ భారత్ -ఇప్పటి వరకూ చాలా రకాల వైరస్‌లను ప్రపంచం చూసింది. కానీ ఎందుకు కరోనాకు మాత్రమే వణికిపోతున్నాం..?
- డా. మీనాక్షి- ఫ్లూ కలిగించే వైరస్‌కు దీనికి తేడా ఏంటంటే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది. 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూను పోలి ఉంది. ఆ స్థాయిలోనే ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుందని వైద్యరంగం ఆందోళన చెందుతోంది.
- ఈటీవీ భారత్ - లక్షణాల పరంగా చూస్తే.. సాధారణ జలుబు లాంటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో ఎన్నో అరుదైన జబ్బులకు కూడా చికిత్స చేయగలిగారు. కానీ ఇంత సాధారణ లక్షణాలున్న జబ్బును ఎందుకు తగ్గించలేకపోతున్నాం. వేగంగా వ్యాప్తి చెందడమే కారణమా..?
- డా. మీనాక్షి- వేగంగా వ్యాప్తి చెందడమే కారణం. ఇంతకు ముందు ప్రయాణాల వల్లే వస్తుందని భావించారు. కానీ ఇప్పుడు స్థానికంగా వ్యాప్తి చెందుతోంది. నివారించడం కోసం.. అన్ని పబ్లిక్ స్థలాలను తాత్కాలిక క్వారంటైన్లుగా మార్చారు.
- ఈటీవీ భారత్ - అమెరికాలో చాలా దారుణమైన పరిస్థితులున్నాయి. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులుంటే... వేలాది మంది చనిపోయారు. మీరున్న ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది...?
- డా. మీనాక్షి - మేముండేది మాసాచ్యుసెట్. న్యూయార్కుతో పోల్చితే మాది చాలా చిన్న రాష్ట్రం. ఇక్కడ ప్రభావం కూడా తక్కువుగానే ఉంది. ఇక్కడ మేం కూడా లాక్ డౌన్ పాటిస్తున్నాం. బయటకు రావడం లేదు.
- ఈటీవీ భారత్ - కరోనా విషయంలో అమెరికా చాలా ఉదాశీనంగా వ్యవహరించిందని మిగతా దేశాలు ఆరోపిస్తున్నాయి. చాలా ఆలస్యంగా స్పందించారని తప్పుబడుతున్నారు కదా..?
- డా. మీనాక్షి- అన్ని దేశాలు కూడా తమకు ఏమీ కాదన్న ధీమాతోనే ఉన్నాయి. ఇతర దేశాల నుంచి ప్రయాణాల వల్లే వచ్చిందని భావన ఉంది. న్యూయార్క్‌లో కేసులు పెరిగాయని తెలిసిన తర్వాత చైనా నుంచి, యూరోప్ నుంచి విమాన ప్రయాణాలు రద్దు చేశారు. అయినప్పటికీ.. ఇతర దేశాల నుంచి రాకపోకలు ఎక్కువుగా ఉన్న రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువుగానే ఉంది.
- ఈటీవీ భారత్ - వైద్య ప్రమాణాల విషయంలో భారత్ వంటి దేశాలతో పోల్చితే అమెరికా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. అయినా ఇక్కడతో పోల్చినప్పుడు అక్కడ కేసుల సంఖ్య ఎందుకు ఎక్కువా?
- డా. మీనాక్షి- దీనికి పూర్తి స్థాయి వైద్యం తెలీదు. ఏ మందులు పనిచేస్తాయన్న దానిపై స్పష్టత లేదు. దీనికి భౌతిక దూరం పాటించడం ఒక్కటే మార్గం. మొదట్లో అమెరికా ఆ పనిచేయలేదు. ఆ విషయం అర్థమైన తర్వాత నుంచి అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ పాటిస్తున్నాయి. జర్మనీ, ఫిన్లాండ్ వంటి దేశాల్లో వ్యాప్తి తక్కువుగా ఉంది. కానీ అవి చాలా చిన్న దేశాలు కాబట్టి సాధ్యమైంది. తాజా పరిస్థితుల్లో న్యూయార్క్‌లో కూడా కాస్త ఉధృతి తగ్గుతోంది.
- ఈటీవీ భారత్ - అమెరికాలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది కదా.. అక్కడ ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు ఎలా ఎదుర్కొంటున్నారు.?
- డా. మీనాక్షి - అందరిలోనూ కాస్త ఆందోళన ఉంది. ఎప్పటి నుంచో అక్కడ ఉంటున్నవారితో పాటు.. కొత్తగా వచ్చిన ఐటీ ఉద్యోగులు కూడా ఇళ్ల లోనే ఉంటున్నారు. అందరూ ఇంటి నుంచే పనులు చేస్తున్నారు.
- ఈటీవీ భారత్ - భారత్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అక్కడి వారి స్పందన ఏంటి..? ఇక్కడ కూడా కేసులు బాగానే ఉంటున్నాయి కదా..?
- డా. మీనాక్షి - భారత్‌లో బాగా నియంత్రిస్తున్నారన్న అభిప్రాయం ప్రవాసాంధుల్లో ఉంది. భారత్‌లో 21 రోజులు లాక్డౌన్ అంటే ఇంత పెద్ద దేశంలో సాధ్యమవుతుందా అనుకున్నాం.. కానీ ప్రాణభయంతో కాబోలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
- ఈటీవీ భారత్ - కరోనా ప్రభావంతో ఇళ్ల నుంచి ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ప్రపంచ జనాభాలో చాలా భాగం పూర్తిగా ఇళ్లకే పరిమితం అయిపోయింది. ఇన్ని రోజులు ఇంట్లో ఉంటే మానసికంగా ఎలాంటి సమస్యలు వస్తాయి.?
- డా.మీనాక్షి- దీని ప్రభావం ఎక్కువుగానే ఉంది. నా రోగులు చాలా మంది తాము తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని చెబుతున్నారు. బయటకు వెళితే రోగం వచ్చి చనిపోతామేమోనన్న ఆందోళనలో ఉన్నారు.
- ఈటీవీ భారత్ - కేవలం ఆరోగ్యపరంగానే కాదు.. దీంతో ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఉద్యోగభద్రత, భవిష్యత్ ఎలా ఉండబోతోందేమో అన్న ఆందోళన ఉంటోంది కదా.. ?
- డా. మీనాక్షి - ఆ భయం కూడా ఉంది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. కొన్ని సంస్థలు ఉద్యోగులను సెలవుపై పంపుతున్నాయి. ఆ ఒత్తిడి కూడా ఉంటోంది.
- ఈటీవీ భారత్ - అమెరికన్లు సహజంగానే ఎక్కువ ఆందోళనకు గురవుతుంటారు. 9/11 దాడులప్పుడు దేశమంతా భయాందోళనలకు గురైంది. ఇప్పుడు అక్కడి వాళ్ల పరిస్థితి ఎలా ఉంది...?
- డా.మీనాక్షి - ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్విన్ టవర్ అటాక్ అనేది చాలా చిన్న విషయం. ప్రస్తుత పరిస్థితిపై అమెరికాలో ఆందోళన చాలా ఎక్కువుగా ఉంది.
- ఈటీవీ భారత్- తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో అన్న ఆందోళనతో చాలా మంది తుపాకులు కొనుక్కుంటున్న దృశ్యాలు అక్కడ మీడియాలో చూశాం...?
- డా. మీనాక్షి -ఇప్పుడు వాటిని బాగా నియంత్రించారు. తర్వాత అరాచక పరిస్థితులు వస్తాయేమో అన్న ఆందోళనతో ముందుగా తుపాకులు కొనుక్కోవడానికి కొంతమంది ప్రయత్నించారు.
- ఈటీవీ భారత్ - ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఏమైనా మందులున్నాయా..?
- డా. మీనాక్షి- ఎక్కువ మంది ఒత్తిడి, ఆదుర్దాతోనే మమ్మల్ని సంప్రదిస్తున్నారు. అలాంటి వారికి లొరాజిపామ్, క్లొనాజిపామ్ వంటి మందులు ఇస్తుంటాం. దీంతో తాత్కాలిక ఉపశమనం కలుగుతోంది.
- ఈటీవీ భారత్ - లాక్ డౌన్ సమయంలో కుటుంబం అంతా ఇంట్లోనే ఉండాలి. ఇలాంటి సమయంలో పిల్లలకు సంబంధించి మీరు ఏ యాక్టివిటీస్ సూచిస్తున్నారు.
- డా. మీనాక్షి- పెద్దవాళ్లు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. అలాగే ఇంట్లోనే ఉండి ఆడుకునే పాతకాలం ఆటలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- ఈటీవీ భారత్ - అమెరికా లాంటి దేశాల్లో వైద్యసహాయం, కౌన్సెలింగ్ అందుబాటులో ఉంటాయి. కానీ భారత్‌లో కొన్నివేల మందికి ఒక సైక్రియాటిస్ట్ కూడా లేరు. ఇలాంటి సమయంలో వారికి తగిన సాయం ఎలా అందుతుంది...?
- డా. మీనాక్షి - మనకు అంతర్గతంగానే ఆ సాయం అందుతుంది. మన కుటుంబ వ్యవస్థలోనే ఆ ఏర్పాటు ఉంది. భారత్ లో ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. ధైర్యం చెప్పేవాళ్లుంటారు. బంధువులు కూడా దగ్గర్లోనే ఉంటారు. వీళ్లే తోడ్పాటు అందిస్తారు.
- ఈటీవీభారత్ - కరోనా ప్రభావం తగ్గిపోయాక పౌరసమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయనుకుంటున్నారు.
- డా. మీనాక్షి - ఈ లాక్ డౌన్ కారణంగా కొన్ని మంచి పనులు కూడా జరిగాయి. కరోనా తగ్గిపోయిన చాలా మంది ఇంటి నుంచే పనిచేయడానికి ఇష్టపడతారు.