ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Corona Symptoms : "లక్షణాలున్నా ఆందోళన అవసరం లేదు.. ఆరు నెలల తర్వాత ఎండెమిక్‌గా కరోనా"

Corona Symptoms : కరోనా లక్షణాలున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌ గ్లోబల్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ లోకేశ్వరరావు ఈదర అంటున్నారు. అయితే వయసు మళ్లినవారు, ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు మాత్రం అప్రమత్తతంగా ఉండాలని సూచించారు. ఆరు నెలల తర్వాత ఎండెమిక్​గా మారుతుందని చెప్పారు.

doctor lokeshwar about corona symptoms
లక్షణాలున్నా ఆందోళన అవసరం లేదు.. ఆరు నెలల తర్వాత ఎండెమిక్‌గా కరోనా

By

Published : Jan 18, 2022, 11:06 AM IST

Corona Symptoms : ‘కరోనా లక్షణాలు కనిపించినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయిదు రోజుల్లో అవి తగ్గుముఖం పడుతున్నాయి. వయసు మళ్లినవారు, ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారిలో అప్రమత్తత అవసరం. లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరి.. మూడు రోజులకోసారి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. చికిత్స ప్రారంభించిన అయిదు రోజుల తరవాత పరీక్ష చేయిస్తే సరిపోతుంది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో చాలా అరుదుగా సాధారణ, జలుబు దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి’ అని అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌(ఆపీ) గ్లోబల్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ లోకేశ్వరరావు ఈదర చెప్పారు. హైదరాబాద్‌ వచ్చిన ఆయన ‘ఈనాడు-ఈటీవీ భారత్​’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎలా ఉంది?
డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ 70 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయినా దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డెల్టా వేరియంట్‌ ముక్కు, గొంతు నాళాల నుంచి ఊపిరితిత్తులకు వేగంగా చేరేది. అప్పటికే ఇతర వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారిలో కొందరు చనిపోయేవారు. ఒమిక్రాన్‌.. ఊపిరితిత్తులకు చేరకముందే నిర్వీర్యమవుతోంది. వ్యాక్సిన్‌ వేసుకోనివారు దీని బారిన పడే అవకాశం ఉంది. లక్షణాలు కనిపించగానే పరీక్షలు అవసరం లేదు. వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించి మాత్రలు తీసుకుని ఐసొలేషన్‌లో ఉంటే సరిపోతుంది. ఐసీఎంఆర్‌ సైతం ఇదే విషయం చెబుతోంది.

అమెరికాలో తీవ్రత ఎక్కువగా ఉందెందుకు?
వ్యాక్సిన్‌పై అవగాహన లేకపోవటమే. అమెరికా, యూకేలలో వయసు మళ్లినవారి జనాభా ఎక్కువ. అమెరికాలో వ్యాక్సిన్‌ వేసుకోనివారిలో ఇతర వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నవారు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. యూకేలోనూ వయసు మళ్లిన వారు ఎక్కువే ఉన్నా వ్యాక్సిన్‌ తీసుకోవటంతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య అమెరికాతో పోలిస్తే తక్కువే. మరణిస్తున్న వారూ తక్కువే.

వైరస్‌ ఇంకా ఎంత కాలం ఉండే అవకాశముంది?

వైరస్‌ తీవ్రత తగ్గుతూ వస్తోంది. మరో ఆరు నెలల తరవాత ఎండెమిక్‌గా మారుతుంది. సాధారణ జ్వరం, జలుబు స్థాయికి చేరుకుంటుంది. వ్యాక్సిన్‌, మాస్కుల ద్వారానే వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుంది. భారతదేశంలో చాలామంది వస్త్రంతో కుట్టిన మాస్కులు వాడుతున్నారు. ఇవి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. ఇవి వైరస్‌ను నియంత్రించలేవు.

రోగ నిరోధక శక్తి పెంచుకునేదెలా?

సాధారణంగా శరీరం తయారు చేసుకునే రోగ నిరోధక శక్తికి కంటి నిండా నిద్ర, మానసిక ప్రశాంతత, ఆందోళనలను దరిచేరనీయకపోవటం, వ్యాయామం, ధ్యానం తోడైతే మరింత పెరుగుతుంది. ఆహారం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఏది తిన్నా, ఏది తాగినా క్యాలరీల లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల వయసు, ఒత్తిడులు, జన్యుపరంగా వచ్చే వ్యాధులను కనీసం పదేళ్లు వెనక్కు నెట్టేయవచ్చు.

ప్రభుత్వపరంగా ఏయే అంశాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరముంది?

రెండు అంశాలకు ప్రాధాన్యమివ్వాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ పంపాం. అందులో ఒకటి.. ఆహారం విషయంలో చైతన్యం అంశాన్ని కనీసం అయిదో తరగతి నుంచి పాఠ్యాంశాల్లో చేర్చాలి. భవిష్యత్తు తరాల కోసమైనా ఇది చాలా అవసరం. రెండోది.. భారతదేశంలో కుటుంబ వైద్య విధానాన్ని ప్రోత్సహించేందుకు మెడికల్‌ సీట్లు పెంచాలి. ప్రపంచ దేశాల్లో కుటుంబ వైద్యానికి ప్రాధాన్యం ఎక్కువ.

ఇదీ చదవండి:

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం.. 50 మందికి పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details