Tidco houses: రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిడ్కో) ఆధ్వర్యంలో చేపట్టిన గృహాలకు రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అందించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు నిర్దేశిత గృహ సముదాయంలో ఉన్న అన్ని గృహాలు పూర్తి చేసి...అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందించాలనుకున్నారు. నిర్మాణాల పూర్తికి అవసరమైన నిధుల్ని (రుణ రూపేణా) బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అందించేందుకు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.
అదిగో ఇస్తాం...ఇదిగో ఇస్తాం అని అధికారులు తేదీలు ప్రకటిస్తున్నారే తప్ప...ఆ గడువు దాటిపోయినా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. తాజాగా జులై నెలాఖరు నాటికి 1.50 లక్షల ఇళ్లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకారం మే నెలాఖరు నాటికి కొన్ని గృహాలను లబ్ధిదారులకు ఇవ్వాలని అధికారులు నిర్ణయించినా ఇవ్వలేకపోయారు. దీంతో రిజిస్ట్రేషన్ పూర్తయిన వాటిని ఎక్కడికక్కడ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
మౌలిక సదుపాయాలు ఉంటే అప్పగింత..రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 2.62 లక్షల టిడ్కో గృహాల్లో గత ప్రభుత్వ హయాంలోనే సుమారు 80 వేల ఇళ్లు 90 శాతం మేర పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆ సంఖ్య లక్షకు చేరింది. గృహ సముదాయాల్లో 1000 మొదలు.. 10 వేల వరకు గృహాలున్నాయి. ఇందులో మూడో వంతు పూర్తయినా లబ్ధిదారులకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.
అంతకన్నా తక్కువ పూర్తయినా... తాగునీరు, విద్యుత్తు సౌకర్యం, సెప్టిక్ ట్యాంకు అందుబాటులో ఉంటే అప్పగింతకు మొగ్గుచూపుతున్నారు. ఈ నెల 15వ తేదీలోగా తూర్పుగోదావరి జిల్లా, విజయనగరం జిల్లా, 15 తర్వాత విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్నింటిని లబ్ధిదారులకు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.