పేదోళ్లకు గుండెజబ్బు (Heart disease) వస్తే ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో దిక్కులేని పరిస్థితి నెలకొంది. నిమ్స్‌ను మినహాయిస్తే రాష్ట్రం మొత్తమ్మీద గుండెజబ్బులొస్తే క్యాథ్ ల్యాబ్ సౌకర్యమున్న ప్రభుత్వ ఆసుపత్రులు రెండే రెండు. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రి. ఇవి మినహా యాంజియోగ్రామ్‌లు, యాంజియోప్లాస్టీలు నిర్వహించే ఆసుపత్రులు మరెక్కడా లేవు. అయితే ఈ రెండింటిలో ప్రస్తుతం క్యాథ్ ల్యాబ్(Cath lab) సేవలు అందుబాటులో లేవు.
గత ఏడాదిగా ఉస్మానియా క్యాథ్ ల్యాబ్ (Cath lab) మరమ్మతులకు గురై మూలనపడగా.. కొవిడ్ కేంద్రంగా మారిన గాంధీ ఆసుపత్రిలోనూ ఏడాదిన్నరగా అక్కరకు రావట్లేదు. ఉస్మానియాలో కొత్త క్యాథ్‌ల్యాబ్ కోసం ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. అయినా కూడా పరికరాల కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో.. ఆ ప్రభావం రోగులపై పడుతోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రోగులు నిమ్స్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల భారమంతా నిమ్స్‌పైనే పడుతుండడంతో రోగులు చికిత్స కోసం వారాల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో రోగులు అర్థాంతరంగా కన్నుమూస్తున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి.
ఏడాదిగా అతీగతీ లేదు...
ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి కార్డియాలజీ విభాగం కింద రోజూ సుమారు 300 మంది వస్తుంటారు. ఇక్కడ రోజుకు 10-15 వరకూ యాంజియోగ్రామ్‌లు, 7-10 వరకూ యాంజియోప్లాస్టీలు జరుగుతుంటాయి. గత ఏడాది ఫిబ్రవరిలో కొవిడ్ కాలంలోనూ 160 మందికి గుండె చికిత్సలు క్యాథ్‌ల్యాబ్(Cath lab)లో చేశారు. వాటిలో 99 యాంజియోగ్రామ్‌లు ఉండగా.. 25 సింగిల్ స్టెంట్ యాంజియోప్లాస్టీలు, 19 డబుల్ స్టెంట్ యాంజియోప్లాస్టీలు, 3 మూడు స్టెంట్ల యాంజియోప్లాస్టీలతో పాటు ఇతరత్రా చికిత్సలు ఇక్కడ జరిగాయి. అంత కీలకమైన క్యాథ్‌ల్యాబ్ సేవలు ఇప్పుడు నిలిచిపోయాయి. తయారు చేసిన కంపెనీ ప్రమాణాల ప్రకారం 2006లో నెలకొల్పిన ఈ క్యాథ్‌ల్యాబ్ 2016 వరకే పనిచేస్తుంది. కానీ దీనికి మరమ్మతులు చేస్తూ 2019 వరకూ లాక్కొచ్చారు.
‘ఇక ఏం చేసినా ఈ పరికరం పనిచేయద’ని ఉత్పత్తి సంస్థ మెకానిక్‌లే చేతులెత్తేశారు. అయినా దానికి మరమ్మతులు చేసి గత ఏడాది మే వరకూ నడిపారు. అప్పటికే పని భారం పెరిగిన ఆ పరికరం పూర్తిగా మొరాయించడంతో అప్పట్నించి క్యాథ్‌ల్యాబ్ సేవలు పూర్తిగా ఆగిపోయాయి. ప్రభుత్వం స్పందించి.. 2020 డిసెంబరులోనే రూ.7 కోట్ల నిధులను మంజూరు చేసింది. అయినా కొనుగోలుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ముందుకు సాగలేదు. నేటికీ కొత్త క్యాథ్‌ల్యాబ్‌కు ఉస్మానియా నోచుకోలేదు.
పీజీ సీట్లు కోల్పోయే ప్రమాదం