ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Electricity Bills: విద్యుత్‌ ఛార్జీలు పెంచేందుకు అనుమతించండి: డిస్కంలు - విద్యుత్ ఛార్జీలు తాజా వార్తలు

Electricity Bills: గృహ విద్యుత్‌ వినియోగదారులపై భారాన్ని మోపేందుకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) సిద్ధమవుతున్నాయి. ఏఆర్‌ఆర్‌లో టారిఫ్‌ హేతుబద్ధీకరణ పేరుతో ప్రతిపాదన తీసుకొచ్చాయి. ఈ మేరకు కేటగిరీలో మార్పులు చేశాయి. దీని ప్రకారం కాస్ట్‌ ఆఫ్‌ సర్వీస్‌ (COS) ఆధారంగా యూనిట్‌ ధరలను నిర్దేశించాయి.

విద్యుత్‌ ఛార్జీలు పెంచేందుకు అనుమతించండి
విద్యుత్‌ ఛార్జీలు పెంచేందుకు అనుమతించండి

By

Published : Dec 14, 2021, 7:54 AM IST

Increase Electricity Charges: గృహ విద్యుత్‌ వినియోగదారులకు టారిఫ్‌ హేతుబద్ధీకరణ పేరుతో వినియోగదారులపై భారాన్ని మోపాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) భావిస్తున్నాయి. ఈ మేరకు కేటగిరీలో మార్పులు చేశాయి. దీని ప్రకారం కాస్ట్‌ ఆఫ్‌ సర్వీస్‌ (COS) ఆధారంగా యూనిట్‌ ధరలను నిర్దేశించాయి. దీనికోసం శూన్య నికర ఆర్థిక లోటు ఉండేలా వార్షిక ఆదాయ అవసరాల నివేదికను (ARR) రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (APERC)లో దాఖలు చేశాయి. వినియోగదారులపై భారం పడకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తే.. ఆ మేరకు సబ్సిడీ మొత్తాన్ని భారీగా పెంచుకోవాల్సి వస్తుంది. హేతుబద్ధీకరణ పేరుతో గతంలో మూడు గ్రూపులుగా ఉన్న గృహ విద్యుత్‌ కేటగిరీని.. రెండుకు కుదించింది. 50 యూనిట్లలోపు వినియోగించే గృహ వినియోగదారుల నుంచి యూనిట్‌కు రూ.1.45 వంతున వసూలు చేస్తున్నాయి. గత ఇరవై ఏళ్లుగా దీనిలో మార్పు లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2022-23కు డిస్కంలు దాఖలు చేసిన ఏఆర్‌ఆర్‌లో ఎల్‌టీ కేటగిరీ వినియోగదారుల టారిఫ్‌లో మార్పులు చేయాలని ప్రతిపాదించాయి. అలాగే హెచ్‌టీ (పరిశ్రమల) వినియోగదారులనూ సీజన్‌ వారీగా (నెలల వారీగా) టైమ్‌ ఆఫ్‌ డే (TOD) ఛార్జీలను వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా కనిపించని భారాన్ని మోపనున్నాయి. ఈ మేరకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏఆర్‌ఆర్‌ను ఏపీఈఆర్‌సీలో సోమవారం దాఖలు చేశాయి. 2022-23లో విద్యుత్‌ విక్రయాలు 66,530 మిలియన్‌ యూనిట్లుగా అంచనా వేశాయి. దీనికోసం వివిధ మార్గాల్లో 74,815 ఎంయూలను సమకూర్చుకోవాలని నివేదికలో పేర్కొన్నాయి. సరఫరా, పంపిణీ నష్టాలు కలిపి 11 శాతంగా అంచనా వేశాయి.

విద్యుత్‌ ఛార్జీలు పెంచేందుకు అనుమతించండి
  • గతంలో బి, సి గ్రూపులుగా ఉన్న కేటగిరీలను కలిపేశారు. కొత్త టారిఫ్‌ను 2022 ఆగస్టు నుంచి అమలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి.
  • సీవోఎస్‌ అంటే.. విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం, ప్రసార, పంపిణీ నష్టాలు, ఇతర ఖర్చులు కలిపి వినియోగదారునికి చేరే వరకు అయ్యే ఖర్చులన్నీ కలిసిన మొత్తం. దీని ఆధారంగా ఒక్కో యూనిట్‌పై ఇచ్చే సబ్సిడీని అధికారులు నిర్దేశించారు. దీని ప్రకారం బీ3 కేటగిరీ వినియోగదారులు యూనిట్‌కు రూ.7 వంతున, బీ4 కేటగిరీ వినియోగదారులు రూ.7.50 వంతున చెల్లించాల్సి వస్తుంది.
  • ఉదాహరణకు.. బీ4 కేటగిరీ కింద 310 యూనిట్లు వినియోగిస్తే.. విద్యుత్‌ ఛార్జీల రూపేణా రూ.2,325 చెల్లించాలి. ఏ2 కేటగిరీ కింద 70 యూనిట్లు వినియోగిస్తే సబ్సిడీ పోను యూనిట్‌కు రూ.2.80 వంతున రూ.196 విద్యుత్‌ ఛార్జీలుగా చెల్లించాలి.
    విద్యుత్‌ ఛార్జీలు పెంచేందుకు అనుమతించండి

మొదటిసారి శూన్య నికర ఆర్థిక లోటు

ప్రభుత్వ సబ్సిడీలను పరిగణనలోకి తీసుకోకుండా ఏఆర్‌ఆర్‌ ప్రతిపాదనలను ఏపీఈఆర్‌సీకి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం గత నెల 15న విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లను ఆదేశించింది. ఈ మేరకు అన్ని కేటగిరీల విద్యుత్‌ వినియోగదారులకు సరఫరా చేసే విద్యుత్‌కు అయ్యే పూర్తి వ్యయం ఆధారంగా డిస్కంలు ఆదాయ అంచనాలను రూపొందించాయి. విద్యుత్‌ ఛార్జీలను యూనిట్‌ ప్రాతిపదికన చూపాయి. సరఫరా వ్యయం యూనిట్‌కు రూ.6.98 వంతున అవుతుందని పేర్కొన్నాయి. దీని ప్రకారం 2022-23లో నికర ఆర్థిక లోటు '0'గా చూపాయి.

  • హెచ్‌టీ వినియోగదారులకు (పరిశ్రమలకు) టైమ్‌ ఆఫ్‌ డే (TOD) సీజన్‌ వారీగా వసూలు చేసే విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టింది. పగటి వేళల్లో వివిధ సోర్సుల నుంచి వచ్చే చౌక విద్యుత్‌ ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని సీజన్‌ వారీగా (హై/లో గ్రిడ్‌ డిమాండ్‌) టీవోడీని ప్రవేశపెట్టడం వల్ల పెరిగే పారిశ్రామిక విద్యుత్‌ డిమాండ్‌ను ఇతర వినియోగదారులపై భారం పడకుండా సరఫరా చేసే అవకాశం ఉంటుందని ఏఆర్‌ఆర్‌ ప్రతిపాదనల్లో డిస్కంలు పేర్కొన్నాయి.
  • ఉదయం 6-10 గంటల మధ్య టీవోడీ ఛార్జీలు వసూలు చేయాలని ప్రతిపాదించారు.
  • సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య గతంలో యూనిట్‌కు రూపాయి వంతున వసూలు చేసే టీవోడీ ఛార్జీలను ఫిబ్రవరి-మే మధ్య , సెప్టెంబరు, అక్టోబరు మధ్య రూ.2 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు.
  • ఉదయం 10-15 (మధ్యాహ్నం 3) మధ్య, అర్ధరాత్రి 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు (20-06 టైమ్‌ స్లాట్‌) మధ్య వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు 50 పైసలు రాయితీ ఇచ్చే విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టాలని డిస్కంలు భావిస్తున్నాయి.
    విద్యుత్‌ ఛార్జీలు పెంచేందుకు అనుమతించండి
  • రూ.28 వేల కోట్ల నష్టాల్లో డిస్కంలు
  • 2021 మార్చి నాటికి రూ.28,599.28 కోట్ల నష్టాలున్నాయని ఏఆర్‌ఆర్‌లో డిస్కంలు పేర్కొన్నాయి. 2021 నవంబరు నాటికి నిర్వహణ మూలధన రుణాలు రూ.29,536 కోట్లున్నాయని వెల్లడించాయి. సబ్సిడీ మొత్తాలు, ప్రభుత్వ శాఖల విద్యుత్‌ బకాయిలు రూ.9,210 కోట్లు, ఉదయ్‌ పథకం రూ.953 కోట్లు కలిపి ప్రభుత్వం నుంచి రూ.13,560 కోట్లు వసూలు కావాలని తెలిపాయి.
  • 2020-21లో విద్యుత్‌ కొనుగోలు వ్యయం రూ.26,469 కోట్లు, నెట్‌వర్క్‌ వ్యయం రూ.14,620 కోట్లు ఖర్చు చేశామని.. దీని ప్రకారం యూనిట్‌ ఉత్పాదక వ్యయం రూ.7.52గా పేర్కొన్నాయి.
  • 2014-15 నుంచి 2020-21 వరకు ట్రూ అప్‌ కింద రూ.25,595 కోట్ల వసూలుకు డిస్కంలు ప్రతిపాదిస్తే.. రూ.3,121 కోట్ల వసూలుకు ఏపీఈఆర్‌సీ అనుమతించింది. ఇదే కాలానికి నెట్‌వర్క్‌ ట్రూ అప్‌ ఛార్జీల కింద రూ.7,224 కోట్ల వసూలుకు ప్రతిపాదిస్తే.. రూ.3,670 కోట్ల వసూలుకు అనుమతించింది. ట్రాన్స్‌కో ట్రూఅప్‌ కింద రూ.529 కోట్ల వసూలుకు ప్రతిపాదన దాఖలు చేసింది.

ఇదీ చదవండి

HC On Justice Chandru: 'వెలుగులో ఉండేందుకే ఇలాంటి వ్యాఖ్యలు'.. జస్టిస్‌ చంద్రుపై హైకోర్టు ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details