ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పేద విద్యార్థులకు ఆన్​లైన్ పాఠాలు అందినట్టేనా?! - ఏపీలో ఆన్​లైన్​లో పాఠాలు న్యూస్

కరోనా వైరస్ కారణంగా విద్యా బోధన కొత్తమార్పుల్ని సొంతం చేసుకున్నా.. డిజిటల్ పరికరాలు అందుబాటు లో లేని కారణంగా చాలా మంది విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాలు అందని ద్రాక్షలాగే మారాయి. ప్రైవేటు పాఠశాలలు మొబైల్, ట్యాబ్, ల్యాప్ టాప్, పర్సనల్ కంప్యూటర్ల ద్వారా ఆన్ లైన్ లోనే పాఠాలు చెబుతున్నా... గాడ్జెట్ లు లేకపోవటం.. ఇంటర్నెట్ కనెక్టివిటీ లాంటి ఇబ్బందులు పేద విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ప్రభుత్వం దూరదర్శన్, రేడియో మాధ్యమాల ద్వారా పాఠ్యాంశాలను బోధించేందుకు ప్రయత్నించినా ... సమాచార లోపం కారణంగా అవి ఏ మేరకు సద్వినియోగం అయ్యాయన్నది ప్రశ్నార్థకం.

digital classes not available for student
digital classes not available for student

By

Published : Sep 28, 2020, 10:31 PM IST

కరోనా వైరస్ సంక్షోభం విద్యావ్యవస్థను కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది. వైరస్ వ్యాప్తి కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలను మూసివేయటంతో ఇంటి నుంచే విద్యార్థులు పాఠాలు నేర్వాల్సిన పరిస్థితి. ప్రైవేటు పాఠశాలలు కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల ద్వారా కంప్యూటర్ క్లాసులను నిర్వహిస్తూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలలు మాత్రం తమ విద్యార్థులకు దూరదర్శన్ ద్వారా ఆకాశవాణి రేడియో మాధ్యమం ద్వారా మాత్రమే పాఠాలు చెప్పేందుకు ప్రయత్నించాయి. అయితే ఈ రెండూ అందుబాటులో లేని విద్యార్థులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో కవరేజీ కారణంగా ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలను నేర్చుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. దీంతో పాటు కొందరి వద్ద అసలు మొబైల్ ఫోన్లు, ట్యాబ్ లు, ల్యాప్ టాప్ లేదా పర్సనల్ కంప్యూటర్ లాంటి గాడ్జెట్ లు లేనికారణంగా విద్యార్థులు పాఠాలు నేర్చుకోలేని పరిస్థితి. ఇక పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఖరీదు కలిగిన మొబైల్ ఫోన్లు కలిగి ఉన్నప్పటికీ డాటా ఖరీదైంది కావటంతో ప్రైవేటు పాఠశాలల్లో చదివే చాలా మంది పేద విద్యార్థులు వెనకపడిపోయిన దుస్థితి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ గంటల పాటు అధ్యాపకులు పాఠాలు చెబుతుండటంతో అంతర్జాల డాటా రెండు మూడు గంటలకే అయిపోయిన పరిస్థితి.

ప్రభుత్వ పాఠశాలలు ఆన్‌లైన్ లో విద్యాబోధన చేయనప్పటికీ.. దూరదర్శన్ ద్వారా, రేడియో మాధ్యమం ద్వారా పాఠాలు బోధించాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే సమాచార లోపం కారణంగా దీన్ని ఎంతమంది విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారన్నది ప్రశ్నార్థకం.

కొవిడ్ సమయంలో సాధారణం కంటే డాటా వినియోగం పెరిగినట్టు ప్రభుత్వం చెబుతోంది. మార్చి 22వ తేదీ జనతా కర్ఫ్యూ నుంచి మొదలై లాక్ డౌన్ సమయం లో ప్రతీ నెలా 66 శాతం మేర డాటా ట్రాఫిక్ పెరగటంతో డాటా పరంగానూ విద్యార్థుల తరగతులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రైవేటు పాఠశాలలు జూమ్ యాప్ తో పాటు గూగుల్ మీట్ తదితర అప్లికేషన్ల ద్వారా ఆన్ లైన్ తరగతులు నిర్వహించాయి. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం తదితర నగరప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల విద్యార్థులకు ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్య తీవ్రంగా ఎదురైంది. కార్పొరేట్ సహా ప్రైవేటు పాఠశాలలు అన్నీ జూమ్ యాప్ ద్వారా బోధన చేసినప్పటికీ ఎంతవరకూ ఆ పాఠ్యాంశాలు విద్యార్థికి చేరాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు 10 తరగతి నుంచి ఎగువన ఉన్నత విద్యకు సంబంధించి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకునేందుకు నిబంధనలు సడలించటంతో రాష్ట్రంలో ఆ తరగతుల విద్యాబోధన నేరుగానే ప్రారంభమైంది. అయితే దిగువ తరగతి విద్యార్థుల విషయంలో ఇప్పటికీ తల్లితండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆన్ లైన్ విద్య.. క్షేత్రస్థాయి వరకూ చేరేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ ఆర్థిక పరమైన అంశాలు ముడిపడి ఉన్నందున పేద విద్యార్థులకు గాడ్జెట్ లు, అంతర్జాలం అందని ద్రాక్షలా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్కువ మంది విద్యార్థులకు సాంకేతిక మాధ్యమం ద్వారా చేసిన ఆన్ లైన్ బోధన అందుబాటులో లేకుండా పోయింది. మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఉన్న కొద్ది మంది విద్యార్థులు నెట్ వర్క్ కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లటంతో పాటు ఎత్తైన కొండ ప్రాంతాలకు, భవనాల పైకప్పులకు వెళ్లి నేర్చుకున్న పరిస్థితి ఉంది.

ఇదీ చదవండి:

'వ్యవసాయ బిల్లులు రైతుల పాలిట మరణ శిక్షలు'

ABOUT THE AUTHOR

...view details