భారత జట్టులో ఉండేవాణ్ని !
నాకు క్రికెట్ అంటే పిచ్చి. ఎప్పుడూ క్లాస్‌లు ఎగ్గొట్టి క్రికెట్ గ్రౌండ్‌లోనే గడిపేవాడిని . ఇంటర్ అయ్యాక తమిళనాడు స్టేట్ క్రికెట్ టీమ్‌కు సెలక్ట్ అయ్యా కానీ...ఇంజనీరింగ్ కోసం రష్యా వెళ్లడంతో ఆడలేదు. ఇక్కడే ఉండి ఉంటే భారత్ జట్టులో ఆడి ఉండేవాణ్ని. అలాగే పన్నెండేళ్లుగా చెన్నై, ఒంగోల్లో యాభై మంది పేద విద్యార్థుల్ని చదివిస్తున్నా.
పిలకతో ఇబ్బందిపడ్డా...
నిజం సినిమాలో పిలకతో నటించాల్సి వచ్చింది. బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేది. అలానే ఒంటి మీద రక్తం పోసుకునే సీన్ ఉంటుంది. దానికోసం నామీద రంగుపోశారు. కంటిన్యుటీ పోతుందని మెుదటిరోజు షూటింగ్ అయ్యాక కడిగేసుకోనివ్వలేదు తేజ. అలా ఇంటికెళితే అమ్మ భయపడుతుందని హోటల్ రూం తీసుకున్నా. రంగుతో ఉన్న నన్ను చూసి అక్కడందరూ భయపడ్డారు.
ఆ బాధతో డిప్రెషన్లోకి వెళ్లిపోయా...
నేను రష్యాలో చదువుతున్నప్పుడే ఇక్కడ అన్నయ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వీసా సమస్య వల్ల రాలేకపోయా. ఆ బాధతో డిప్రెషన్లోకి వెళ్లిపోయా. రెండు నెలలపాటు కాలేజీకి వెళ్లలేదు. అమ్మ అప్పటికే నాన్నను పోగొట్టుకున్న బాధలో ఉంది. అన్నయ్య మరణంతో మరింత కుంగిపోయిన అమ్మతో ఏం మాట్లాడాలో, ఎలా ఓదార్చాలో తెలియక మూడు నెలలపాటు ఫోన్ కూడా చేయలేదు.
అన్నయ్య నా ముక్కు కోశాడు
చిన్నప్పుడు మా అన్నయ్య వాళ్ల క్లాస్ టీచర్ తప్పు చేసినప్పుడల్లా ‘ముక్కు కోసి పప్పులో వేస్తా’ అనేదట. దాంతో ఒకరోజు బ్లేడు తీసుకొచ్చి ‘ముక్కు కోసి పప్పులో వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం...’ అంటూ నా ముక్కుకోసే ప్రయత్నం చేశాడు. అది చూసి అమ్మ గట్టిగా అరవడంతో అన్నయ్య పారిపోయాడు. ముక్కుకి మూడు కుట్లు కూడా పడ్డాయి. అప్పుడు గాటు బాధపెట్టినా ఇప్పుడు నాలోనే ఉండి అన్నయ్య జ్ఞాపకమైంది.