ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చిన్నారులపై పెరిగిన లైంగిక నేరాలు..నివేదిక విడుదల చేసిన డీజీపీ - డీజీపీ గౌతం సవాంగ్‌ తాజా వార్తలు

సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధిస్తున్న వ్యక్తులపై సైబర్‌ బుల్లీయింగ్‌ ద్వారా ప్రత్యేక నిఘా పెట్టినట్లు డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. మంగళగిరిలోని కమిషనర్‌ కార్యాలయంలో.. వార్షిక నివేదిక వెల్లడించిన ఆయన.. పోలీసు శాఖ సాధించిన విజయాలను వివరించారు.

DGP Gautam Sawang revealed the annual statistics of the police department
పోలీసుశాఖ వార్షిక గణాంకాలు వెల్లడించిన డీజీపీ గౌతం సవాంగ్‌

By

Published : Dec 23, 2020, 8:32 PM IST

Updated : Dec 24, 2020, 6:08 AM IST

పోలీసుశాఖ వార్షిక గణాంకాలు వెల్లడించిన డీజీపీ గౌతం సవాంగ్‌

గత ఏడాది కాలంలో రాష్ట్రంలో చిన్నారులపై లైంగిక నేరాలు (పోక్సో కేసులు), మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు గణనీయంగా పెరిగాయి. మాదకద్రవ్యాలు, జూదం, ఇసుక అక్రమరవాణా కేసులూ అధికమయ్యాయి. వరకట్న చావులు, అత్యాచారాలు, వేధింపులు, లాభంకోసం హత్యలు, బందిపోటు దొంగతనాలు, దోపిడీలు, కొల్లగొట్టడాలు తగ్గాయి. సాధారణ చోరీలు గణనీయంగా పెరగ్గా.. హత్యలు, హత్యాయత్నాలు, అపహరణలు, సైబర్‌ నేరాలు వంటివి తగ్గాయి. చిన్న చిన్న దాడులు మాత్రం స్వల్పంగా పెరిగాయి. 2019తో పోలిస్తే 2020లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల నేరాలు 15 శాతం తగ్గాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రకటించారు. వార్షిక నేర గణాంకాల్ని మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం విడుదల చేశారు. విజయనగరం, విశాఖపట్నం గ్రామీణ, విశాఖపట్నం సిటీ, తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం అర్బన్‌, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు అర్బన్‌, గుంటూరు గ్రామీణ, ప్రకాశం, కర్నూలు, తిరుపతి అర్బన్‌, కడప జిల్లాల్లో గతేడాది కంటే నేరాలు తగ్గాయి. నెల్లూరు, అనంతపురం, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో మాత్రం 2019 కంటే 2020లో నేరాలు పెరిగాయి. నెల్లూరులో అత్యధికంగా 11 శాతం నేరాలు పెరగ్గా.. కడపలో 49 శాతం తగ్గాయి. సైబర్‌ నేరాల్లో విశాఖపట్నం సిటీ మొదటి స్థానంలో ఉంది.


మొత్తం నేరాలు ఇలా:
* 2019లో నమోదైన మొత్తం నేరాలు 1,11,112
* 2020లో నమోదైనవి 94,578
* తగ్గుదల 15 శాతం


88 మోసపూరిత రుణ యాప్‌ల గుర్తింపు
ఆన్‌లైన్‌లో సూక్ష్మ రుణాలిచ్చి మోసాలు, వేధింపులకు పాల్పడుతున్న 88 యాప్‌లను గుర్తించామని, వీటి నిర్వాహకుల వేధింపులపై 22 కేసులు నమెదు చేశామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వీటి వినియోగానికి అవకాశం లేకుండా సాంకేతికపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని స్టేషన్లలోని లాకప్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పోలీసు ప్రధాన కార్యాలయానికి అనుసంధానిస్తామని చెప్పారు. పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్‌, అదనపు డీజీపీలు రవిశంకర్‌ అయ్యన్నార్‌, ఎన్‌.శ్రీధర్‌రావు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

సీఎంఆర్ గ్రూప్​న​కు సెట్​బ్యాక్ మినహాయింపులు ఇస్తూ ఉత్తర్వులు

Last Updated : Dec 24, 2020, 6:08 AM IST

ABOUT THE AUTHOR

...view details