రాష్ట్ర ప్రభుత్వం మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తూ... జారీ చేసిన ఉత్తర్వులు ఉపసంహరించుకునే వరకు తాము ఉద్యమిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రకటించారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను నిర్భయంగా బయటకు తీసుకొచ్చేందుకు అవకాశం లేకుండా... చేసేందుకు మంత్రివర్గ సమావేశంలో మీడియా స్వతంత్రతను దెబ్బతీసేలా నిర్ణయాలు చేయడం ఆక్షేపణీయమని మాజీ మంత్రులు దేవినేని ఉమ పేర్కొన్నారు.
విజయవాడ నగరంలోని తెదేపా కార్యాలయంలో కేబినెట్ నోట్ ప్రతులను తగలబెట్టి తమ నిరసన తెలిపారు. అక్టోబర్16వ తేదీని రాష్ట్ర చరిత్రలో చీకటిరోజుగా అభివర్ణించారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యతిరేకంగా కథనాలు రాసే వారిపై కేసులు నమోదు చేసేలా ఉత్తర్వులు తెచ్చారని... వాటికి నగిషీలు చెక్కి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మీడియా గొంతు నొక్కేలా వ్యవరిస్తున్నారని ధ్వజమెత్తారు.