పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఛానల్ ద్వారా గోదావరి నీటి మళ్లింపు 2019లోనే జరిగితే.. కొత్తగా తామే చేసినట్లు వైకాపా ప్రభుత్వం బడాయి కబుర్లు చెప్తోందని మాజీమంత్రి దేవినేని ఉమా విమర్శించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో పోలవరానికి రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు చేసిన రూ.4347 కోట్లు, కేంద్రం గత రెండేళ్లలో విడుదల చేసిన మొత్తాన్ని ముఖ్యమంత్రి జగన్ ఎవరికిచ్చారని ప్రశ్నించారు. నిర్వాసితుల ఖాతాల్లోకి, ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆ నిధులు ఖర్చు చేయకుండా ఎటు తరలించారో సమాధానం చెప్పాలన్నారు.
"క్షేత్రస్థాయికి వెళితే నిర్వాసితులు బెదిరిస్తున్నందునే మొహం చెల్లక మంత్రి అనిల్ వర్చువల్గా స్పిల్ వే నీటి మళ్లింపు కార్యక్రమం నిర్వహించారు. గత రెండేళ్లలో ఎంతమంది నిర్వాసితులకు న్యాయం చేశారో సమాధానం చెప్పాలి. తప్పుడు ఖాతాల్లోకి నిర్వాసితుల డబ్బులు మళ్లించి వాటిని తినేస్తున్నారు. దిల్లీలో ముఖ్యమంత్రి జగన్ తనను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ట్వీట్ చేశారు. సొంత కేసుల మాఫీ కోసం 90 నిమిషాలు కేంద్ర పెద్దలతో సమయం వెచ్చించిన సీఎం పోలవరం నిధులకు 20 నిమిషాలు కూడా కేటాయించలేదు. చంద్రబాబు హయాంలో రూ.11,600 కోట్లు పోలవరానికి ఖర్చు చేస్తే, గత రెండేళ్లలో వైకాపా ఖర్చు చేసింది రూ.845 కోట్లు మాత్రమే. పోలవరం, ఇతర విభజన హామీల నిధులపై ఆర్థిక శాఖ మంత్రి సమయం కోరేందుకు జగన్ ఎందుకు భయపడుతున్నారు. సీబీఐ కేసులు, బెయిల్ రద్దు భయంతోనే కేంద్రం నుంచి డబ్బులు తీసుకురాలేకపోతున్నారు" అని దేవినేని దుయ్యబట్టారు.