జగన్ దర్శకత్వంలో పోలవరం ప్రాజెక్టు అంతులేని కథలా ఉందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. గత ఏడాది జూన్ నాటికి ప్రాజెక్టు పనులు 71.2శాతం పూర్తైతే..ఇవాళ జరిగిన ముఖ్యమంత్రి సమీక్షలో 72.09గా తేల్చి ఏడాదిన్నరలో కేవలం 0.89శాతం పనులు మాత్రమే చేసినట్లు ఒప్పుకున్నారని దుయ్యబట్టారు. 18 నెలలుగా 1 శాతం పనులు కూడా చేయలేని వారు.. 2022 జూన్ నాటికి ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని నిలదీశారు. 135 అడుగులకు మాత్రమే ప్రాజెక్టు నిర్మించి 120 టీఎంసీల నీరు నిలబెట్టేందుకు నిర్ణయించారని ఆరోపించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మీటర్ తగ్గించమని అడిగితే...లాలూచీ పడి 4మీటర్లు తగ్గిస్తున్నారని మండిపడ్డారు.
నిర్వాసితులకు రూ.27 వేల కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉండగా...3,330 కోట్లు మాత్రమే ఇస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 అడుగుల మేర పోలవరం నిర్మించి 194 టీఎంసీల నీరు ఎప్పటికి నిలబెడతారో సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు. 2022 జూన్ నుంచి 2025 జూన్ వరకు 60 టీఎంసీలు, 90 టీఎంసీలు, 120 టీఎంసీలు ఇలా పెంచుకుంటూ పోతామనటం దుర్మార్గమని ఆక్షేపించారు.