కొండపల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల తనపై దాడికి యత్నించిన దుండగులే వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్‌తో కలిసి చంద్రబాబు ఇంటిపైకి దాడికి వచ్చారని మాజీమంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ..ఒకవైపే చూస్తున్న పోలీసులు ఇకనైనా మారి రెండో వైపూ చూడాలని హితవు పలికారు. జోగి రమేశ్ డ్రైవర్ ఫిర్యాదు ఆధారంగా తెదేపా నేతలపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు 15 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. తెదేపా నేతలు చేసిన ఫిర్యాదుపై మాత్రం నామమాత్రపు బెయిల్ వచ్చే సెక్షన్ల కింద కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.
చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చిన అరాచక శక్తులు, గూండాలపై పెట్టాల్సిన కేసుల్ని.., దాడిని తిప్పికొట్టి ధైర్యంగా నిలబడిన వారిపై పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఎస్సీ రైతు పులి చిన్నాపై హైకోర్టుకు కూతవేటు దూరంలో హత్యాయత్నం చేశారని ఆక్షేపించారు. అధికార పార్టీ శాశ్వతం కాదని పోలీసులు గుర్తించాలన్న ఉమా.. తప్పు చేసే ప్రతి ఒక్కరి పేరూ పార్టీ కేంద్ర కార్యాలయంలో నమోదు చేస్తున్నామని తెలిపారు. తప్పు చేసిన వారంతా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.