హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యతను వైకాపా ప్రభుత్వం విస్మరిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శ్రీవారి భక్తుల మనోభావాలను కించపరిచే రీతిలో ముఖ్యమంత్రి జగన్ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. హిందూ దేవాలయాల పవిత్రతను కాపాడాల్సిన ప్రభుత్వం.. తన బాధ్యత మరచి వ్యవహరిస్తోందన్నారు. హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవటంలో విఫలమైందని మండిపడ్డారు.
అవినీతి పాలనను ప్రశ్నించిన ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధించటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అమరావతిలో వేలాదిమంది రైతులు రోడ్డెక్కినా...పట్టించుకోకుండా మూడు రాజధానులంటూ ఒంటెద్దు పోకడతో ముందుకు వెళ్లటాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను అయోమయంలో పడేయటం మంచిది కాదని హితవు పలికారు.