బల్దియా ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థులంతా గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓడిపోతామనే సంకేతం వస్తే మాత్రం డిపాజిట్ దక్కితే చాలనుకుంటారు. ఓటమి చవిచూసినా పరువు పోకుండా ఉండాలంటే ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం డిపాజిట్ ఓట్లు అయినా దక్కించుకోవాలని ఆశపడుతుంటారు. ప్రస్తుతం బల్దియా ఎన్నికలు.. చలిలోనూ రాజకీయ పార్టీలకు చమటలు పట్టిస్తున్నాయి. ప్రధానపక్షాలన్నీ ఎన్నికలను సవాల్‌గా స్వీకరించగా రాజకీయం రసవత్తరంగా మారింది. మారుతున్న రాజకీయ సమీకరణలతో డివిజన్లలో ఏ క్షణం.. ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నారు.
గ్రేటర్ బరిలో అభ్యర్థులకు డిపాజిట్ గుబులు..!
ఎన్నికల బరిలో నిలిచాక అభ్యర్థులందరూ విజయం సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఒక్క ఓటు తేడాతో అయినా గెలవలేకపోతామా! అనే నమ్మకంతో చివరి వరకూ ఉంటారు. ఒకవేళ వాతావరణం అనుకూలించక ప్రతికూల ఫలితం వస్తుందనే సంకేతం వస్తే కనీసం ధరావతు దక్కితే చాలనుకుంటారు.
2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ తెరాస, తెదేపా భాజపా కలిసి, లోక్‌సత్తా, ఎంఐఎం తదితర పార్టీలు పోటీపడ్డాయి. కొన్ని డివిజన్లలో పోటీపడిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీగానే ఖర్చుచేశారు. ఫలితం తమకు అనుకూలంగా వస్తుందనే అంచనా వేసుకున్నారు. కానీ చివరకు చాలామంది ఆశలు అడియాశలయ్యాయి. కనీసం ధరావతు కూడా సంపాదించుకోలేకపోయారనే ముద్రవేయించుకున్నారు. వీరిలో అధికశాతం కాంగ్రెస్, తెదేపా అభ్యర్థులున్నారు. కేపీహెచ్‌బీ డివిజన్ నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి అత్యల్పంగా కేవలం 3, చర్లపల్లి స్వతంత్ర అభ్యర్థి 5 ఓట్లు సాధించారు.
అత్యధికం.. అత్యల్పం
2016 గ్రేటర్ ఎన్నికల్లో సీతాఫల్‌మండి నుంచి పోటీ చేసిన తెరాస అభ్యర్థి సామ హేమ 15,071 అత్యధిక ఓట్ల మెజార్టీ సాధించారు. జాంబాగ్‌లో ఎంఐఎం అభ్యర్థి మోహన్ అత్యల్పంగా 5 ఓట్ల తేడాతో గెలుపొందారు.