రాష్ట్ర ప్రభుత్వం గనులశాఖలో మరింత పారదర్శకతను తీసుకువచ్చేందుకు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ(డీఎంజీ) వెంకటరెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని డీఎంజీ కార్యాలయంలో గనుల శాఖలో.. గనుల లీజుదారులతో ఏర్పాటు చేసిన రెండు రోజుల వర్క్‌షాపుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలపై అవగాహన కల్పించారు. గనులశాఖలో అనేక నిబంధనలు సక్రమంగా అమలు చేయట్లేదని.. వాటిలోని లొసుగులను ఉపయోగించుకొని కొందరు అక్రమ మైనింగ్‌కు పాల్పడతూ.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ అక్రమాలకు చెక్ పెడుతూ.. మైనింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు, లీజుదారుల సమస్యలను గుర్తించేందుకు మైనింగ్ పాలసీపై సమగ్ర అధ్యయనం చేసినట్లు తెలిపారు.
మైనింగ్ పాలసీలో సంస్కరణలు
ప్రస్తుతం అమలులో ఉన్న పలు నిబంధనలను మరింత పటిష్ఠం చేయడంతోపాటు లీజుదారులకు ప్రోత్సాహకరంగా ఉండేలా మైనింగ్ పాలసీలో ప్రభుత్వ అనుమతితో సంస్కరణలను తీసుకువచ్చాం జాతీయస్థాయిలో మైనర్ మినరల్స్‌లో రాష్ట్రం 24శాతం సామర్ధ్యం కలిగి ఉందని.. అపారమైన ఖనిజ వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం, మరోవైపు మైనింగ్ ఆధారిత పరిశ్రమలకు చేయూతను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు నిబంధనల్లో మార్పులు చేసింది. వేలం నిర్వహించడం వల్ల లీజుదారులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయంగా గనుల లీజుల మంజూరీలో ప్రీమియం లేనివి పెంచారు. ఈ పెంపుదల సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలను గనులశాఖ అధికారులు శాస్త్రీయంగా పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకుంది.