తెదేపా కార్యకర్తలు పంచాయతీ ఎన్నికలు ఎదుర్కొన్న తీరు హర్షణీయమని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎన్ని దారుణాలు చేసినా.. పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా..శ్రేణులు పోరాట పటిమ కనబరిచాయని అభినందించారు.
"పంచాయతీ ఎన్నికల్లో వైకాపా నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగనివ్వకుండా దారుణంగా, కిరాతకంగా నిర్వహించిన తీరు అంతా చూశారు. ఓటేసే స్వేచ్ఛ కూడా ప్రజలకు లేకుండా చేశారు. అభ్యర్థులు పోటీ చేయకుండా దౌర్జన్యాలు చేశారు. ఎక్కడ చూసినా కుట్రలు, దౌర్జన్యాలు, ఇంటికెళ్లి కొట్టడం, చంపడం వంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. నా రాజకీయ జీవితంలో ఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు" -అయ్యన్నపాత్రుడు, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు
పోలవరం నీటిని సన్న బియ్యం వాహనాల్లో తరలిస్తారా ?
దొంగ లెక్కలు చెప్పటానికి తెదేపా..విజయసాయి రెడ్డి పెట్టిన సూట్‌కేసు కంపెనీ కాదని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. "కేంద్రం మెడలు వంచేసి, నీటి నిల్వ సామర్ధ్యాన్ని 41.15 మీటర్లకు తగ్గించి, మీ దొంగల బ్యాచ్ చేస్తున్న పనులు అందరికీ తెలుసు. అదే జరిగితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లు ఎలా వస్తాయి. విశాఖ జిల్లా ప్రజల అవసరాలు ఎలా తీరుతాయి. పోలవరం నుంచి సన్నబియ్యం వాహనాల్లో నీరు తరలిస్తారా. దొంగ లెక్కల రెడ్డి దొంగ లెక్కలు చెప్తే, ప్రజలు మరోసారి పాదరక్షల సన్మానం చేస్తారు" అని ట్విటర్ వేదికగా దుయ్యబట్టారు.