విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయంగా గుర్తింపు ఉంది. భక్తుల సౌకర్యాలు, కార్యాలయ నిర్వహణ, ఉద్యోగుల నివాస గృహాలు ఇలా వివిధ అవసరాల కోసం భారీగానే విద్యుత్ వాడుతున్నారు. దుర్గ గుడితో పాటు కొండ దిగువున ఉన్న భవనాలు, జమ్మిదొడ్డి కార్యాలయం, సి.వి.రెడ్డి ఛారిటీస్, మాడపాటి సత్రం, ఉద్యోగుల క్వార్టర్లు సహా అన్నింటికీ కలిపి నెలకు రూ. 8 లక్షల వరకు విద్యుత్తు బిల్లులకు ఖర్చవుతోంది. ఈ స్థాయిలో విద్యుత్తు బిల్లులకు ఖర్చవడంతో సౌర విద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఐదేళ్ల కిందట ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
విజయవాడ శివార్లలోని పాతపాడులో దేవాలయానికి చెందిన ఐదెకరాల్లో మూడేళ్ల కిందట సౌర విద్యుత్తు ప్లాంట్ పనులు ప్రారంభించి వడివడిగానే పూర్తి చేశారు. ప్లాంట్ ను సబ్ స్టేషన్‌కు అనుసంధానించడం కోసం కేబుళ్లు ఏర్పాటు చేయడంలో వచ్చిన ఇబ్బందుల కారణంగా రెండేళ్లవుతున్నా ఉత్పత్తి మాత్రం ఆరంభించలేదు. సౌరశక్తి ప్లాంటు నుంచి కేబుళ్లు వేసే విషయంలో తొలుత సమీప గ్రామాల ప్రజలు అభ్యంతరం తెలిపారు. రెండు గ్రామాల ప్రజలను ఒప్పించే విషయంలో రెండేళ్ల కాలయాపన జరిగింది. ఇటీవల కేబుళ్లను మరో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా మళ్లించారు.
దుర్గగుడికి ఏటా ఈవోలు మారుతూ ఉండడంతో సౌర విద్యుత్తు ప్లాంట్‌ను అందుబాటులోనికి తీసుకురావడంలో తగిన శ్రద్ధ చూపలేదు. ప్లాంట్‌కు ప్రణాళికలు రూపొందించినది ఒకరి హయాంలో.. నిర్మాణం మరొకరి హయాంలో జరిగింది. ఆ తర్వాత మరో ఇద్దరు ఈవోలు మారారు. ఇంజినీరింగ్ విభాగం అధికారులు సైతం తరచూ మారుతుండడం వల్ల పర్యవేక్షణ కూడా కొరవడుతోంది. గ్రామస్తుల అభ్యంతరంతోనే పనులు నిలిచాయని అధికారులు చెబుతున్నారు.