ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"వాళ్లు రూ.11 కోట్లు ఖర్చుపెట్టారు.. సీఆర్‌డీఏ వద్ద రూ.4 కోట్లు లేవా..?" - విజయవాడ తాజా వార్తలు

BRIDGE: విజయవాడలో వేలాది మంది వాహనదారులకు ఉపయోగపడే వంతెన విషయంలో సీఆర్​డీఏ అధికారుల తీరు దారుణంగా ఉంది. నిర్మాణం పూర్తైనా.. కేవలం 4 కోట్ల రూపాయల నిధులు లేవంటూ మూడేళ్లుగా అలాగే వదిలేశారు. సిద్ధార్థ అకాడమీ ఆధ్వర్యంలో వంతెన కోసం 11 కోట్లను ఖర్చు చేస్తే.. రూ.4 కోట్లను సీఆర్‌డీఏ పెట్టలేకపోవడమేంటమని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.

BRIDGE
సీఆర్‌డీఏ నిర్లక్ష్యం.. ప్రయాణికులకు తప్పని పాట్లు..!

By

Published : Jun 6, 2022, 2:55 PM IST

BRIDGE:విజయవాడలోని బందరు రోడ్డుపై పెరిగిపోయిన ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు.. 2018లో సీఆర్​డీఏ ఆధ్వర్యంలో వీఆర్​ సిద్ధార్థ కళాశాల వద్ద వంతెన నిర్మాణం చేపట్టారు. సిద్ధార్థ అకాడమీతో కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఒప్పందం చేసుకున్నారు. దానిలో భాగంగా రూ.11 కోట్లతో పైవంతెన నిర్మాణం చేపట్టే బాధ్యతను సిద్ధార్థ అకాడమీకి అప్పగించారు. పై వంతెనపై శబ్ద కాలుష్య నివారణ కోసం.. సౌండ్‌ బారియర్స్‌ ఏర్పాటు, కింది నుంచి డ్రైనేజీ కాలువల నిర్మాణం సీఆర్​డీఏ ఆధ్వర్యంలో చేపట్టాలనేది ఒప్పందం. అనుకున్నట్టుగానే.. ఏడాదిలోపే పైవంతెనను సిద్ధార్థ అకాడమీ నిధులతో నిర్మాణం పూర్తిచేశారు. కానీ.. ఆ తర్వాత నుంచి చేపట్టాల్సిన సీఆర్‌డీఏ పనులు ఆగిపోయాయి. అప్పటినుంచి నిధులు లేవంటూ అధికారులు చెబుతుండడంతో.. పైవంతెన పూర్తైనా వాహనదారులకు అందుబాటులోకి రావడం లేదు.

సీఆర్‌డీఏ నిర్లక్ష్యం.. ప్రయాణికులకు తప్పని పాట్లు..!

బందరు రోడ్డుపై ఐదారేళ్లలో విపరీతమైన వాహన రద్దీ పెరిగిపోయింది. అందుకే.. ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి బందరు రోడ్డుకు సమాంతరంగా పక్కనుంచే ఉన్న పంట కాలువ రోడ్డును ప్రత్యామ్నాయంగా మార్చేందుకు.. గత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. గతంలో ఆటోనగర్‌ వరకు మాత్రమే ఉన్న పంటకాలువ రోడ్డును.. తాడిగడప వందడుగుల రోడ్డుకు కలపాలని 2016లో నిర్ణయించారు. ఆటోనగర్‌ నుంచి వి.ఆర్‌.సిద్థార్థ కళాశాల వరకు ఖాళీగా ఉన్న పంట కాలువను సీఆర్​డీఏ ఆధ్వర్యంలో పూర్తిగా పూడ్చేసి.. ఆరు నెలల్లోనే రోడ్డును వేసేశారు. ఈ రోడ్డుకు అనుసంధానంగా సిద్ధార్థ కళాశాల మీదుగా.. 400 మీటర్ల పొడవైన పైవంతెననూ సిద్ధార్థ అకాడమీ సొంత నిధులతో నిర్మించింది.

ప్రస్తుతం ఈ పైవంతెనను అందుబాటులోనికి తీసుకురావాలంటే ఒప్పందం ప్రకారం సౌండ్‌ బారియర్స్‌ను ఏర్పాటు చేయాలి. 400 మీటర్ల వంతెనపై కోటి రూపాయలలోపే సౌండ్‌ బారియర్స్‌ ఏర్పాటుకు ఖర్చవుతుంది. పైవంతెన కింది భాగం నుంచి 800 మీటర్ల పొడవులో డ్రైనేజీ కాలువలను రెండు వైపులా నిర్మించాలి. వీటికి రెండున్నర కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల వరకు అవుతుంది. మొత్తంగా రూ.4 కోట్లలోపే నిధులతో ఈ పెండింగ్‌ పనులను పూర్తిచేస్తే పైవంతెనను అందుబాటులోనికి తీసుకురావొచ్చు. అయినా అధికారులు చొరవ చూపడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details