దీపావళి అంటేనే దివ్వెల పండుగ. దీపంతో సృష్టి, స్థితి, లయలకు సన్నిహితమైన సంబంధం ఉందని..అది ప్రజ్వలించినప్పుడు వచ్చే కాంతిని త్రిమూర్తులకు ప్రతీకని పురాణాలు చెబుతున్నాయి. విద్య, శక్తి, సంపదలను ప్రసాదించే ముగ్గురమ్మలు సరస్వతి, దుర్గ, లక్ష్మి దీపం కాంతిలో కొలువై ఉంటారని పెద్దలు చెబుతారు. అందుకే ‘దీపం పరబ్రహ్మ స్వరూపం’అని భావిస్తూ ఆరాధిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దీపావళి రోజు..టపాసులు, మతాబులు వంటి పర్యావరణానికి హాని కలిగించే వాటి జోలికిపోకుండా నిరాడంబరంగా హరిత దీపావళి జరుపుకుంటున్నాయి కృష్ణాజిల్లా గూడవల్లికి చెందిన కొన్ని కుటుంబాలు.
దీపం విశిష్టతను భావితరాలకు తెలియజేసేలా..గూడవల్లికి చెందిన సాంబశివరావు 20 ఏళ్లుగా తన ఇంటి ఆవరణలో వెయ్యి దీపాలతో దీపావళి పండుగు నిర్వహిస్తున్నారు. టపాసులు, మతాబుల గోల లేకుండా కేవలం నూనె దీపాలతోనే ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు. నువ్వులనూనె దీపాలు వెలిగించడం ద్వారా జీవితాల్లో వెలుగులు నింపుకోవాలనే ఆకాంక్ష..దీపావళి పండుగలోనే ఇమిడి ఉందని ఆయన వివరించారు. బంధుమిత్రులతో కలిసి లక్ష్మి పూజ అనంతరం చీకటివేళకు దీపాలు వెలిగించి పర్యావరణహితంగా పండుగు జరుపుకుంటామంటున్నారు.