ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సమీపిస్తున్న తుది గడువు...కిట్లను వదిలించుకోవడమే లక్ష్యంగా పరీక్షలు - విజయవాడ వార్తలు

ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధతో యంత్రాంగం ఇలా వ్యవహరిస్తోందనుకుంటే పొరబడినట్లే. గతేడాది ఎడాపెడా కొనుగోలు చేసిన మలేరియా నిర్ధారణ కిట్లు వినియోగం కాక పెద్దమొత్తంలో మిగిలిపోయాయి. ప్రస్తుతం వాటి వినియోగానికి సంబంధించిన తుది గడువు(ఎక్స్‌పైరీ) సమీపిస్తోంది. దీంతో ఎలాగైనా వాటిని వదిలించుకోవాలని మధ్యేమార్గంగా యంత్రాంగం ఇలా పరీక్షలు నిర్వహిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

deadline is approaching tests aimed at getting rid of the kits
సమీపిస్తున్నతుది గడువు...కిట్లను వదిలించుకోవడమే లక్ష్యంగా పరీక్షలు

By

Published : Dec 6, 2020, 11:48 AM IST

Updated : Dec 6, 2020, 1:17 PM IST

గతేడాది మలేరియా పాజిటివ్‌ బాధితుల ఇంటికి సమీపంలోని 40-50 ఇళ్లకు వెళ్లి పరీక్షలు చేయాలని మలేరియా యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రతి ఉద్యోగి రోజుకు కనీసం 100 మందికి పరీక్షలు నిర్వహించాలని మౌఖికంగా లక్ష్యం విధించడంతో ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. కరోనా నేపథ్యంలో వైద్య యంత్రాంగం అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ‘మీరెక్కడెక్కడో తిరిగొస్తారు. మా ఇంట్లో ఎవరికీ జ్వరం లేదు. కనీసం అనుమానిత లక్షణాలు లేవు. దయచేసి ఏ పరీక్షలు చేయొద్దనే’ సమాధానం వస్తోంది. పరీక్షల నిర్వహణకు శ్రమకోర్చాల్సి వస్తోందని సిబ్బంది చెబుతున్నారు. గతంలో ఎవరికైనా మలేరియా పరీక్షలు చేయాల్సి వస్తే తొలుత జిల్లా మలేరియా విభాగం ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నాకే సంబంధిత బాధితుని ఇంటికి వెళ్లేవారు. ఆపై ఎవరికైతే జ్వరం వచ్చి అనుమానంగా ఉందో వారికే పరీక్షలు చేసి సిబ్బంది వెనుదిరిగేవారు. ప్రస్తుతం ఏదైనా ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఎంత మంది కుటుంబీకులు ఉన్నారో వారందరి నుంచి నమూనాలు సేకరిస్తున్నారు. వారికి మలేరియా ర్యాపిడ్‌ కార్డు టెస్ట్‌ (ఎమ్మార్సీటీ) కిట్‌తో పరీక్షించి క్షణాల్లో ఫలితాలు వెల్లడిస్తున్నారు.

ఏ పరీక్ష చేస్తారో తెలియక!

వాస్తవానికి కరోనా నేపథ్యంలో ఈ ఏడాది చాలా వరకు మలేరియా, డెంగీ కేసులు తగ్గాయి. ఇవి అత్యల్పంగా వస్తున్నాయి. మార్చి నుంచి ఇప్పటివరకు పరిశీలిస్తే మలేరియా, డెంగీ అన్నీ కలిపి 100 లోపే ఉంటాయని అధికార వర్గాల సమాచారం. జిల్లా వ్యాప్తంగా గతేడాది 1100కు పైగా మలేరియా కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క గుంటూరు నగరంలోనే సగానికి పైగా కేసులు వచ్చాయి. ఈ ఏడాది వైద్య యంత్రాంగం మొత్తం కొవిడ్‌ పరీక్షల్లో తలమునకలై మలేరియా పరీక్షలు చేయలేదు. ప్రస్తుతం ఇంటింటికి వెళ్తున్న సిబ్బంది గతేడాది మలేరియా కేసులు నమోదైన ప్రాంతాలతో పాటు కొత్తగా దోమల ఉత్పత్తికి స్థావరాలుగా ఉన్న ప్రదేశాలను సైతం గుర్తించి నివేదిక సమర్పించే పనిలో ఉన్నారు. జిల్లాలో 17 సబ్‌ యూనిట్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో పని చేసే వంద మంది మలేరియా ఉద్యోగులతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో పని చేసే హెల్త్‌ అసిస్టెంట్లు, సూపర్‌వైజర్లను సైతం మలేరియా పరీక్షలకు పంపిస్తున్నారని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం అనేక మంది జ్వరాలతో బాధపడుతున్నారు. అది కరోనా? లేక మలేరియా అనేది తెలుసుకోవడానికి మలేరియా కిట్లు పంపి పరీక్షలు చేయిస్తున్నామని అంటున్నారు.

ఇదీ చదవండి:

బుగ్గవాగు సామర్థ్యం పెంపుతో తాగు, సాగునీటికి భరోసా

Last Updated : Dec 6, 2020, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details