ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సాగర్​ పోరు: నేడు నామినేషన్లు వేయనున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు - telangana political news

తెలంగాణలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామినేషన్లకు నేడు తుది గడువు కావడం వల్ల.. ప్రధాన పార్టీల అభ్యర్థులు సహా ఇతరులూ పెద్ద సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేయనున్నారు. అందరికన్నా ముందుగానే అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన కాంగ్రెస్‌తోపాటు... తెరాస, భాజపా అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు.

sagar bi poleసాగర్​ పోరు: నేడు నామినేషన్లు వేయనున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
సాగర్​ పోరు: నేడు నామినేషన్లు వేయనున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

By

Published : Mar 30, 2021, 9:30 AM IST

నాగార్జునసాగర్ ఉపఎన్నికకు.. అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించాయి. ఈ విషయంలో కాంగ్రెస్ ముందు వరుసలో నిలిస్తే.. తెరాస, భాజపా మాత్రం నామినేషన్ల తుది గడువుకు ముందు రోజు మాత్రమే అభ్యర్థిత్వాలను ప్రకటించాయి. కాంగ్రెస్​ నుంచి జానారెడ్డి, తెరాస నుంచి నోముల భగత్, భాజపా అభ్యర్థిగా రవికుమార్ నాయక్ సహా... వివిధ పార్టీలు, స్వతంత్రులు నేడు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

ముగ్గురూ గంట వ్యవధిలో..

తెరాస అభ్యర్థి భగత్ ఉదయం 11 గంటలకు నామపత్రాలు అందజేయనుండగా... మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్ రెడ్డి హాజరు కానున్నారు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి.. మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ వేస్తారని.. పార్టీ వర్గాలు తెలిపాయి. భాజపాలో అంతర్గతంగా తీవ్ర పోటీ నెలకొన్న దృష్ట్యా చివరకు టికెట్ దక్కించుకున్న రవికుమార్ నాయక్.. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరుకానున్నారు.

తెరాస శ్రేణుల్లో ఉత్సాహం..

తెరాస నుంచి ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, కోటిరెడ్డి వంటి నేతలు టికెట్ ఆశించినా.. ఎట్టకేలకు నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌ వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. బీసీ సామాజికవర్గ ఓటర్లు అధికంగా ఉన్న సాగర్ సెగ్మెంట్‌లో... ఆ వర్గానికే చెందిన భగత్‌ను ఎంపిక చేశారు. గెలుపోటములను ప్రభావితం చేస్తుందని భావించే సామాజికవర్గానికే టికెట్ దక్కడంతో.. పార్టీ శ్రేణుల్లోనూ ఒకింత ఉత్సాహం కనపడుతోంది. బీసీల తర్వాత గిరిజనులు ఎక్కువగా ఉన్న సాగర్‌ నియోజకవర్గంలో... అనూహ్యంగా రవికుమార్ నాయక్‌ను భాజపా ఎంపిక చేసింది.

పదకొండోసారి బరిలోకి..

ఇక జానారెడ్డి సైతం... ఈ ఎన్నికలకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పదకొండోసారి బరిలోకి దిగుతున్న ఆయన... రాజకీయాల్లో తనకున్న అనుభవం, పలుకుబడే కలిసి వస్తుందని భావిస్తున్నారు.

సాగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు.. అధికార పార్టీ తరఫున 10 మంది ఎమ్మెల్యులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున... అభ్యర్థి జానారెడ్డే పూర్తి బాధ్యతలు చూస్తున్నారు. అటు భాజపా నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌తోపాటు సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, విజయశాంతి... ప్రచార బాధ్యతలు పర్యవేక్షించనున్నారు.

ఇద్దరికే అవకాశం..

ఇక తుది రోజు నామినేషన్ల పర్వానికి... అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్కో అభ్యర్థి వెంట ఇద్దరిని మాత్రమే... ఆర్వో గదిలోకి అనుమతిస్తున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించవద్దని... ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇవీచూడండి:తిరుపతి ఉపపోరులో ముమ్మరంగా ప్రచారం

ABOUT THE AUTHOR

...view details