విజయవాడలో కలకలం రేపిన కారులో రాహుల్ మృతదేహం కేసును పోలీసులు హత్యగా నిర్ధారించారు. వ్యాపార, ఆర్థిక వ్యవహారాలే హత్యకు కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. కారులోని తాడు, దిండు, నీటి సీసాలపై ఉన్న వేలిముద్రలను క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకుంది. రాహుల్ మెడ కమిలిపోయి ఉండటం గమనించిన పోలీసులు.. ఇది హత్యేనని నిర్ధారణకు వచ్చారు. మృతుని బంధువులు కూడా మృతదేహాన్ని పరిశీలించారు. వారి నుంచి పోలీసులు సమాచారాన్ని సేకరించారు. డాగ్‌స్క్వాడ్ బృందం కూడా సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసుకు సంబంధించిన వివరాలను సాయంత్రం అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.
కేసు పురోగతిపై ఇంఛార్జి సీపీ ఆరా..
కారులో అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటనాస్థలాన్ని ఇంఛార్జి సీపీ పాలరాజు పరిశీలించారు. ఏసీపీ ఖాదర్‌బాషాను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఖరీదైన లగ్జరీ కారు కావడంతో వాహనానికి అధునాతన సౌకర్యాలు ఉంటాయని.. వాటి ద్వారా డిజిటల్ ఆధారాలు సేకరించే అవకాశం ఉంటుందని ఇంఛార్జి సీపీ పాలరాజు తెలిపారు. చుట్టు ప్రక్కల పరిసరాల్లోని సీసీ కెమెరాలు, కాల్‌డాటా ద్వారా కొన్ని ఆధారాలు సేకరించామన్నారు. బంధువులను అడిగి వివరాలను సేకరిస్తున్నామని హత్యా.. ఆత్మహత్యా అనే విషయం త్వరలోనే తేలుస్తామని అన్నారు.