అకాల వర్షాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర రైతుల్ని వణికించాయి. మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులు, పెనుగాలులతో వానలు కురవడంతో కొన్ని చోట్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అనంతపురం జిల్లా హిందూపురంలో గరిష్ఠంగా 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అరటి, మామిడి, బత్తాయి, మొక్కజొన్న, వరి పంటలకు నష్టం వాటిల్లింది. చిత్తూరు జిల్లాలో బుధవారం వేకువ జాము నుంచి మూడు గంటల పాటు వాన కురిసింది. అయిదు మండలాలు మినహా జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడ్డాయి. కడప జిల్లా రాయచోటి ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెండ్లిమర్రి, యర్రగుంట్ల తదితర మండలాల్లోనూ వర్ష ప్రభావం ఉంది. అరటితోపాటు పలు రకాల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. నంద్యాల డివిజన్‌లో ఆళ్లగడ్డ, శిరువెళ్ల, నంద్యాల ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అరటి, మామిడి, బొప్పాయి, మునగ తదితర పంటలకు రూ.9 కోట్ల నష్టం వాటిల్లింది.
బుధవారం ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం, తూర్పు గోదావరి జిల్లా తొండంగి, శ్రీకాకుళం జిల్లా రాజాం తదితర ప్రాంతాల్లో 44 మి.మీ నుంచి 67 మి.మీ వరకు వర్షపాతం నమోదైంది. తుని, గోకవరం, తొండంగి, కాట్రేనికోన తదితర మండలాల్లో ఈదురుగాలుల ప్రభావంతో కొన్నిచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్లు నేల కూలాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరి రైతులు పెద్ద ఎత్తున దెబ్బతిన్నారు. కోసి పనలమీదున్న వరి నీట తడిసింది. ఆరబెట్టిన ధాన్యం నీటిలో నానింది.
వచ్చే రెండు రోజులూ వానలు