బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ నమ్మించి.. కేవైసీ పేరుతో నగదు దోచుకునే ముఠాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. విజయవాడలో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వ్యక్తికి మొదట వాట్సాప్ ద్వారా ఆర్బీఎల్ బ్యాంకు నుంచి కేవైసీ అప్డేట్ చేయమని సంక్షిప్త సమాచారం వచ్చింది. అందులో చెప్పిన విధంగానే అతడు చేశాడు. తర్వాత రోజు ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. వివరాలు నమోదు కాలేదని చెప్పాడు. బయోమెట్రిక్ చేయాలని చెప్పగా అదీ చేశాడు. తర్వాత రోజు మళ్లీ ఫోన్ చేసిన ఆ వ్యక్తి... మీ కార్డు వివరాలు సరిచేయాలి, మీ ఫోన్‌కి సంక్షిప్త సందేశాలొస్తాయి.. అందులో ఉన్న వివరాలు చెప్పండని కోరాడు.
కొద్దిసేపటి తర్వాత సందేశాలు రాగానే కోడ్ చెప్పమన్నాడు. ఆ కోడ్ సంఖ్యల రూపంలో కాకుండా అక్షరాలుగా ఉన్నాయి. ఫోన్ చేసిన వ్యక్తి నెంబరు ట్రూకాలర్‌లో ఆర్బీఎల్ బ్యాంకు అని ఉండటంతో నమ్మి బాధితుడు వివరాలు చెప్పాడు. వాటిని చెప్పగానే బ్యాంకు ఖాతాల్లోంచి 40 వేల నగదు మాయమయ్యింది. ఈ విషయం చెప్పేలోపు ఫోన్ కట్ చేశాడు. లబోదిబోమంటూ బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.