అత్యాధునిక సాంకేతిక.. నూతన పంథాల్లో దోపిడీలతో సైబర్ నేరస్తులు చెలరేగిపోతున్నారు . పోలీసుల దొరక్కుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు . బ్యాంకుల నుంచి సత్వరం స్పందన లేకపోవడంతో దర్యాప్తు ఆలస్యం అవుతోంది. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. కొట్టేసిన సొమ్మును దొరక్కుండా దాచుకోవడానికి పలు ఖాతాలు, వ్యాలెట్ల లోకి మళ్లిస్తూ ఎక్కడా దొరక్కుండా తప్పించుకుంటున్నారు. దీంతో పోయిన సొమ్ములో రికవరీ చాలా తక్కువగా ఉంటోంది. మోసం జరిగిన వెంటనే స్పందిస్తే పోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.
అలా చేస్తే అంతే..
సైబర్ కిలాడీలు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు . నకిలీ లింక్ లతో అమాయకులకు ఎర వేస్తున్నారు . ఆయా సంస్థలు పంపించినట్లుగానే భ్రమింపజేసేలా లింక్ లు ఉంటున్నాయి. మీకు క్రెడిట్ కార్డుకు అర్హత సాధించారు. ఎటువంటి కార్డుకు అర్హులో మీ వివరాలు నమోదు చేసుకోండి.. అంటూ మెయిల్‌లో హైపర్‌లింక్స్ పంపిస్తున్నారు. ఆదాయ పన్ను శాఖ నుంచి అంటూ కూడా పలువురికి మెయిల్స్ వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మీరు సమర్పించిన పత్రాల తాలూకూ మీకు సొమ్ము వెనక్కి వస్తుందని.. లింక్‌పై క్లిక్ చేసి వివరాలు నింపండి అంటూ మెయిల్ చేస్తున్నారు. వీటిపై క్లిక్ చేస్తే దరఖాస్తు ఫారం వస్తుంది. ఇందులో పేరు, చిరునామా, పాన్ నెంబరు, బ్యాంకు ఖాతా, వంటి వివరాలు అడుతుతాయి. వీటిని నింపి పంపితే గోప్యంగా ఉండాల్సిన మన వ్యక్తిగత సమాచారం దొంగల చేతికి వెళ్లినట్లే. దీని ద్వారా కేటుగాళ్లకు తాళం ఇచ్చినట్లే. ఈ వివరాలతో వారు ఖాతాల్లోని సొమ్మును మాయం చేస్తున్నారు.
డబ్బు వాలెట్లలోకి..దాంతో దర్యాప్తు ఆలస్యం
ఫేస్‌బుక్, వాట్సాప్, తదితర సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు పరిచయం చేసుకుంటారు. ఆనక బహుమతులు పంపుతున్నామని, ఉద్యోగాల పేరుతో, తదితర పేర్లు చెప్పి దశలవారీగా అందినకాడికి డబ్బు దండుకుంటారు. నమ్మి చాలా మంది వారు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఆతర్వాత ముఖం చాటేస్తున్నారు. నగర కమిషనరేట్ పరిధిలో సైబర్ మోసగాళ్ల చేతిలో పలువురు మోసపోతున్నారు. నిందితులు చాలా తెలివిగా ఎక్కడా దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కరే వివిధ ఫోన్ నెంబర్లతో చాలా వ్యాలెట్లను తెరుస్తున్నారు. నగరంలో జరిగిన మోసాల్లో పోయిన సొమ్మును వందల సంఖ్యల్లోని వ్యాలెట్లలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వాటిల్లోకి మళ్లించడం వల్ల దర్యాప్తుకు తీవ్ర జాప్యం జరుగుతోంది. అన్ని సంస్థల నుంచి వివరాలు తీసుకోవడం కష్టంగా ఉంటోంది. మళ్లించిన సొమ్మును దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని బ్యాంకుల నుంచి డ్రా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతాలకు వెళ్లడం కూడా పోలీసులకు సమస్యగా మారుతుంది.