రాష్ట్రవ్యాప్తంగా రైతుల భరోసా కేంద్రాలకు అనుసంధానంగా వ్యవసాయ శాఖ సాగు పనిముట్లను రైతులకు అందుబాటులో ఉంచేందుకు కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. రైతులకు వ్యవసాయ పనిముట్లు, ఆధునిక యంత్రాలను అందుబాటులో ఉంచేందుకు ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాక్టర్లు, వరినాటు యంత్రాలు, కలుపుతీత యంత్రాలు, పిచికారీ సంబంధిత పరికరాలు ఇలా వేర్వేరు యంత్రాలను కస్టమ్ హైరింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 వేల 641 రైతు భరోసా కేంద్రాల్లో ఈ సాగు పనిముట్లను అద్దె ప్రాతిపదికన తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రైతులు, కౌలు రైతులు తమకు అవసరమైన సాగు పనిముట్లను పొందేందుకు ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్లను సంప్రదించాల్సి ఉంటుంది. కరోనా కారణంగా రైతులకు కూలీల లభ్యత తక్కువ కావటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. త్వరితగతిన కస్టమ్ హైరింగ్ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు. స్థానికంగా ఉన్న యువతకు ఈ కస్టమ్ హైరింగ్ కేంద్రాల్లోని పరికరాల నిర్వహణ బాధ్యతను అప్పగించనున్నారు.