CS Sameer Sharma News: ఏప్రిల్ 2, 3 తేదీల్లో అన్నిశాఖల ఉన్నతాధికారులూ రాజధానిలోనే అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అఖిల భారత సర్వీసు అధికారులందరికీ సీఎస్ సమీర్ శర్మ సర్క్యులర్ జారీ చేశారు. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులుతోపాటు విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు.. హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గైర్హాజరు కావొద్దని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో జిల్లాల విభజనకు సంబంధించిన కార్యాచరణ ఉండటంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం.. అధికారులందరితో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ఈ మోమో జారీ చేసినట్టు సమాచారం.