ఉద్యోగుల పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఉద్యోగుల బదిలీ విధానంపై ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సమావేశమయ్యారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న సీపీఎస్ రద్దు సాధ్యాసాధ్యాలపై సమావేశంలో చర్చించారు. దీంతో పాటు త్వరలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిర్ణయం తీసుకునే అంశంపైనా చర్చ జరిగింది. అయితే, కరోనా నేపథ్యంలో ఒకేసారి భారీగా బదిలీలు సరికాదని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలుస్తోంది. వివిధ కారణాలతో ప్రభుత్వానికి వచ్చిన బదిలీ దరఖాస్తులపై మాత్రమే నిర్ణయం తీసుకునే అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఈ అంశాలపై మరో దఫా భేటీ అనంతరం నిర్ణయాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.