వివిధ శాఖలకు సారథ్యం వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులే సచివాలయానికి ఎప్పుడో గానీ రాకపోవడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మీరే రోజూ రాకపోతే కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని పర్యవేక్షించే వాళ్లెవరు? వారు క్రమశిక్షణతో ఎలా ఉంటారు?’ అని సీఎస్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. గతంతో పోలిస్తే సచివాలయ నిర్వహణ బాగాలేదని, కొన్ని ఛాంబర్లలో ఏసీలు సరిగా పనిచేయట్లేదని, పరిశుభ్రత కూడా సరిగ్గా లేదని కొందరు ఉన్నతాధికారులు సీఎస్ దృష్టికి తెచ్చినట్టు సమాచారం. అందుకే కొందరు అధికారులు విభాగాధిపతుల కార్యాలయాల నుంచి పనిచేస్తున్నారని వారు చెప్పినట్టు తెలిసింది. ఐఏఎస్‌లు సచివాలయానికి సరిగా వెళ్లడం లేదన్న విషయం ముఖ్యమంత్రి జగన్ దృష్టికి రావడంతో ఆయన ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆయన ఆదేశాల మేరకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో సీఎస్ శుక్రవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. మధ్యాహ్న భోజనం వారితో కలిసే చేశారు. పలువురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశంలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినా, ప్రధానంగా సచివాలయానికి ఉన్నతాధికారుల హాజరుపైనే చర్చ జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఉన్నతాధికారులు సచివాలయానికి రాకుండా క్యాంపు కార్యాలయాల నుంచీ, విభాగాధిపతుల కార్యాలయాల నుంచీ పనిచేయడం సరికాదని, దానివల్ల పరిపాలన గాడి తప్పే అవకాశం ఉందని సీఎస్ వ్యాఖ్యానించారు. కరోనా తీవ్రత తగ్గినందున ఇకపై క్రమం తప్పకుండా సచివాలయానికి రావాలని స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగులకు... కొవిడ్ నేపథ్యంలో నిలిపేసిన బయోమెట్రిక్ హాజరు విధానాన్ని వెంటనే పునఃప్రారంభించాలని సీఎస్ ఆదేశించారు.
సీఎం అసంతృప్తిగా ఉన్నారన్న సీఎస్
గత ఏడాది మార్చిలో కొవిడ్ ఉద్ధృతి మొదలైనప్పటి నుంచి ఐఏఎస్ అధికారుల్లో చాలామంది రెగ్యులర్‌గా రావడం లేదని, విజయవాడ, తాడేపల్లి వంటిచోట్ల ఉన్న విభాగాధిపతుల కార్యాలయాల నుంచే ఎక్కువమంది విధులు నిర్వహిస్తున్నారని కొందరు ముఖ్యమంత్రి దృష్టికి తేవడంతో ఆయన ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ-ఆఫీసు విధానంలో దస్త్రాల్ని ఎక్కడి నుంచైనా పరిష్కరించే వెసులుబాటు ఉన్నా, ఐఏఎస్ అధికారులు క్రమం తప్పకుండా సచివాలయానికి వచ్చి, కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులకు అందుబాటులో ఉన్నప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. వ్యవస్థను గాడిలో పెట్టాలని సీఎస్‌కు ఆయన సూచించారని సమాచారం. సీఎం అసంతృప్తిగా ఉన్న విషయాన్ని అధికారుల దృష్టికి సీఎస్ తెచ్చారని, ఆయన ఆదేశాల మేరకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారని తెలిసింది.