రైతులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ స్పష్టం చేశారు. గ్రామీణ సహకార పరపతి సంఘాలపై ద్వితీయ హైలెవల్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన...రైతు భరోసా కేంద్రాలను గ్రామీణ సహకార పరపతి సంఘాలతో అనుసంధానించడం ద్వారా రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని నాబార్డు, ఆప్కాబ్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ సహకార పరపతి సంఘాలను త్వరితగతిన కంప్యూటరీకరణ చేయటం ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన పరపతి సేవలు అందుతాయన్నారు. అవకాశం ఉన్న మండలాల్లో నూతన సహకార బ్యాంకులు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నష్టాల్లో ఉన్న కడప, కర్నూలు, అనంతపురం, ఏలూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. దీనిపై సంబంధిత అధికారులతో త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని సహకార శాఖ కమిషనర్ బాబును సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు నాబార్డు రీ ఫైనాన్సు చేస్తోందని నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్ కుమార్ జన్నావర్ తెలిపారు. రిజర్వు బ్యాంకు ద్వారా నాబార్డు నుంచి 2 వేల 500 కోట్లు ప్రత్యేక లిక్విడిటీ ఫండ్‌ను పీఏసీఎస్‌లకు అందించడం వల్ల వాటి వ్యాపారం మెరుగైందని పేర్కొన్నారు.