కృష్ణా జిల్లా మండవల్లి సబ్ రిజస్ట్రార్ కార్యాలయంలో ఒకే ఒక్క డాక్యుమెంట్ రైటర్ ఉన్నారు. ఆయనే స్థిరాస్తి లావాదేవీలు చూస్తారు. అందరూ ఆయన దగ్గరే దస్తావేజులు రాయించుకుంటారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ పరిచయాలతో పనులు చేయిస్తుంటారు. మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చాలా తక్కువ రిజిస్ట్రేషన్‌లు జరుగుతుంటాయి. ఏడాదికి ఇక్కడ ఆదాయమే రూ.9 కోట్లు ఉంటుంది. అలాంటిది ఒకే ఏడాది డాక్యుమెంటు రైటర్ ప్రభుత్వ ఆదాయానికి రూ.2.5కోట్లు గండి కొట్టారు. ప్రస్తుతం వసూలుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీనికి తోడు 258 మంది క్రయదారులు డాక్యుమెంట్ రైటర్ చుట్టూ తిరుగుతున్నారు. వీరందరికి నోటీసులు జారీ అయ్యాయి. పూర్తి స్థాయిలో స్టాంపు రుసుము చెల్లిస్తేనే ఆ డాక్యుమెంటు చెల్లుబాటు అవుతుంది. కానీ ప్రతి ఒక్కరూ కనీసం 10శాతం సొమ్ము కూడా చెల్లించలేదు. రూ.లక్ష చెల్లించాల్సిన వారి పేరుతో రూ.10 వేలు చొప్పున మాత్రమే చెల్లించి దాన్ని మార్ఫింగ్ చేసి నకిలీ ఈ చలానాను అప్‌లోడ్ చేశారు. సీఎఫ్‌ఎంఎస్ విదానంలో బురిడీ కొట్టించారు. ఈ విధంగా దాదాపు రూ.2.50 కోట్లు స్వాహా చేశారు.
దీనిలో క్రయదారుల పాత్ర లేకపోయినా ప్రస్తుతం బాధితులు వారే. డాక్యుమెంట్ రైటర్ చెల్లించకపోయినా ముందుగా దస్తావేజులు పొందిన యజమానులు ఈ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మండవల్లిలో రూ.19 లక్షలు మాత్రమే రికవరీ అయింది. ఇది కూడా భీమవరం ప్రాంతానికి చెందిన స్థిరాస్తి వ్యాపారులు చెల్లించారు. వారు వేసిన వెంచర్లలో విక్రయించిన స్థలాలకు సంబంధించి తగ్గిన స్టాంపు రసుము చెల్లించారు. డాక్యుమెంటు రైటర్ మేడేపల్లి బాలాజీపై పోలీసు కేసు నమోదు అయింది. కైకలూరు సీఐ పిలిపించి మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో మాత్రం క్రయదారులకు సమాచారం లేదు. మండవల్లిలో మాత్రం కనిపించడం లేదని చెబుతున్నారు. డాక్యుమెంట్ రైటర్, ఆయన కుమారునికి సంబంధించి రొయ్యల చెరువులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొన్ని స్థలాలు ఉన్నట్లు తెలిసింది. వీటిని అమ్మి సొమ్ములు చెల్లించాల్సి ఉంది. దీనికి గడువు ఇచ్చారు. ఈ విషయం మండవల్లిలో చర్చనీయాంశమైంది. ఒకేసారి కోట్లకు పడగలెత్తడమంటే ఇదేనేమో అని చర్చించుకుంటున్నారు.