తూర్పుగోదావరి జిల్లాలో ముంపునకు గురైన ఏలేరు నదీ పరివాహక ప్రాంతం, వర్షాలకు దెబ్బతిన్న పంటపొలాలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరిశీలించారు. గోనెడ, రామవరం, ఎర్రవరం గ్రామాల్లోని బాధితు రైతులతో మాట్లాడారు. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు లోకేశ్ వద్ద వాపోయారు.
ఒక్కసారైనా పరిహారం ఇచ్చారా ?
ఈ ఏడాది మూడు సార్లు వరదలు వస్తే... ఒక్కసారైనా పరిహారం ఇచ్చారా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆగస్టు, సెప్టెంబరులో వచ్చిన వరదలకు 3.3 లక్షల ఎకరాల్లో పంటనష్టం వచ్చిందన్నారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 70 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. వరదల వేళ నష్టమెలా అంచనా వేస్తారని మంత్రి వ్యాఖ్యానించటం విడ్డూరంగా ఉందన్నారు. వరద బాధితులను పరామర్శించినందుకే తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.